
టెస్టుల్లో గెలిచీ..
ప్రస్తుతం వెస్టిండీస్.. బంగ్లాదేశ్‌తో మూడు ఫార్మట్ల క్రికెట్ మ్యాచ్‌లను ఆడుతోంది. రెండు టెస్ట్ మ్యాచ్‌లల్లో విజయదుందుభి మోగించింది. భారీ తేడాతో వాటిని సొంతం చేసుకుంది. ఆ వెంటనే ఆరంభమైన టీ20 సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండు, మూడు మ్యాచ్‌లను విండీస్ వీరులు ఏకపక్షంగా మార్చివేశారు.

మూడో టీ20లో..
తాజాగా జార్జ్‌టౌన్‌లోని ప్రావిడెన్స్ పార్క్ స్టేడియంలో జరిగిన మూడో టీ20ని అయిదు వికెట్ల తేడాతో గెలుచుకుంది. 2-0 ఆధిక్యతతో సిరీస్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.2 ఓవర్లల్లో అయిదు వికెట్లను కోల్పోయి ఛేదించింది విండీస్. కేప్టెన్ నికొలస్ పూరన్ 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఓపెనర్ కైలే మేయర్స్ 55 పరుగులు చేశాడు.

వన్డేలకు సన్నాహాలు..
ఇక ఈ రెండు జట్ల మధ్య ఎల్లుండి నుంచి వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభమౌతాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 7 గంటలకు తొలి వన్డే ఉంటుంది. 13, 16 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు ఉంటాయి. అనంతరం వెస్టిండీస్.. భారత జట్టును ఎదుర్కొంటుంది.
మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడటానికి టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 22వ తేదీన షెడ్యూల్ అయింది.

శిఖర్ ధవన్ కేప్టెన్సీలో..
వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే జట్టును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుు శిఖర్ ధావన్ సారథ్యాన్ని వహించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కేప్టెన్), శార్దుల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌ను సెలెక్ట్ చేసింది. రవీంద్రజడేజా మినహా సీనియర్లెవరికీ వన్డే జట్టులో చోటు కల్పించలేదు.

సీనియర్లకు పిలుపు..
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు బీసీసీఐని పునరాలోచనలో పడేశాయి. టీ20ల్లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ తిరుగులేని విజయాలను సాధించడాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. విండీస్ ప్లేయర్లు ఫుల్ ఫామ్‌లో ఉన్నందున.. తన నిర్ణయాన్ని మార్చుకోనుంది. సీనియర్లను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. వెస్టిండీస్‌తో అయిదు టీ20 మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నందున- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలను మళ్లీ జట్టులో చోటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే టీ20ల కోసం ప్రకటించే జట్టులో సీనియర్లను తీసుకుంటోందని సమాచారం.


Click it and Unblock the Notifications












