
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.. ఎలాంటి ఆటంకాలు లేకుండా. స్వదేశంలో ప్రత్యర్థి జట్టు తుక్కు రేగ్గొడుతోంది. కరేబియన్ గడ్డపై అడుగు పెట్టిన తరువాత ఇప్పటివరకు ఒక్క అపజయాన్ని కూడా చవి చూడలేదు. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయదుందుభి మోగించింది. శిఖర్ ధావన్ సారథ్యంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తరువాత.. టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టింది. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ సారథి.
ట్రినిడాడ్ అండ్ టుబాగో తరౌబాలో గల బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఏకంగా 68 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 64 పరుగులతో కేప్టన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 41 పరుగులతో మెరుపులు మెరిపించాడు. లక్ష్యఛేదనలో కరేబియన్ వీరులు తడబడ్డారు. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగారు.
ఈ వరుస విజయాలపై రోహిత్ శర్మ స్పందించాడు. జట్టులో చేస్తోన్న కొన్ని ప్రయోగాల వల్ల వరుస విజయాలు సాధ్యపడుతున్నాయని వ్యాఖ్యానించాడు. ఒక్కో ప్లేయర్‌కు ఒక్కోరకమైన బాధ్యతలను అప్పగిస్తోన్నామని, దాన్ని వాళ్లు సమర్థవంతంగా నిర్వహిస్తోన్నారని చెప్పాడు. ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చని, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చవి చూడాల్సి రావొచ్చని పేర్కొన్నాడు. కొన్ని రకాల పిచ్‌లపై తాము చేసే ప్రయోగాలు ఫలించకపోవచ్చని స్పష్టం చేశాడు.
తరౌబా పిచ్‌పై 170 నుంచి 180 పరుగులు చేస్తే విజయం సాధ్యపడుతుందని ముందుగానే అంచనాకు వచ్చామని, అదే లక్ష్యంతో ఆడామని చెప్పాడు. తాము నిర్దేశించుకున్న టార్గెట్ కంటే ఎక్కువ పరుగులు చేయగలిగామని పేర్కొన్నాడు. ఇన్నింగ్ ఆరంభంలో షాట్లను ఆడటంలో కొంత ఇబ్బంది పడినప్పటికీ.. దాన్ని సరిదిద్దుకోగలిగామని చెప్పాడు. స్లో పిచ్‌పై భారీ స్కోర్ చేయడం అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. జట్టులో ప్రతి ప్లేయర్ కూడా పూర్తి సామర్థ్యంతో ఆడుతున్నాడని, జట్టు మొత్తం ఫామ్‌లో ఉందని చెప్పుకొచ్చాడు.