IND vs USA: టీ20 ప్రపంచ కప్ 2026లో అమెరికాపై సాధించిన అద్భుత విజయం తర్వాత భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎందుకు ప్రశాంతత నెలకొందో.. తన పునరాగమనం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీడియా సమావేశంలో వివరించాడు.
సూర్యకుమార్ యాదవ్ భరోసా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉందన్న ప్రశ్నకు సిరాజ్ బదులిస్తూ.. "మేమంతా చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే క్రీజులో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వాంఖడే స్టేడియం సూర్యకు సొంత మైదానం. అక్కడి వికెట్ గురించి సూర్యకు బాగా తెలుసు. 'నేను క్రీజులో ఉన్నాను.. మీరు చింతించకండి' అని సూర్య మాకు భరోసా ఇచ్చాడు" అని సిరాజ్ వెల్లడించాడు. సూర్య చెప్పినట్టే 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

రీ-ఎంట్రీపై సిరాజ్ ఏమన్నాడంటే?
నిజానికి మహ్మద్ సిరాజ్ ఈ ప్రపంచకప్ ప్రాథమిక ప్రణాళికల్లో లేడు. గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. "నేను ఆడుతున్నట్లు మ్యాచ్ రోజు ఉదయమే తెలిసింది. కానీ నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. గత 10 ఏళ్లుగా భారత్ కోసం ఆడుతున్నాను కాబట్టి, అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు" అని సిరాజ్ పేర్కొన్నాడు.ఇటీవల రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు బాగా కలిసి వచ్చిందని.. అక్కడ పాటించిన లైన్ అండ్ లెంగ్త్‌నే ఇక్కడ కూడా కొనసాగించానని చెప్పాడు.
భారత్ లక్ష్యం ఎంత?
పిచ్ స్వభావాన్ని బట్టి భారత్ ఎంత స్కోరును ఊహించిందనే విషయంపై కూడా సిరాజ్ క్లారిటీ ఇచ్చాడు. వికెట్ అసమాన వేగంతో ఉందని ఇషాన్ కిషన్ చెప్పాడని, అందుకే 170 పరుగులు చేస్తే చాలని తాము భావించామని సిరాజ్ వెల్లడించాడు. చివరికి 161 పరుగులు చేసినప్పటికీ, బౌలర్ల సమిష్టి కృషితో ఆ లక్ష్యాన్ని కాపాడుకోగలిగారు.
అభిషేక్ శర్మ ఆరోగ్యంపై అప్‌డేట్
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎక్కువ సేపు ఫీల్డింగ్ చేయకపోవడానికి కారణం కడుపు నొప్పి అని సిరాజ్ స్పష్టం చేశాడు. అయితే ఇది చిన్న సమస్యేనని, తదుపరి మ్యాచ్ కల్లా అతను కోలుకుని తన మ్యాజిక్ చూపిస్తాడని సిరాజ్ ధీమా వ్యక్తం చేశాడు.