
ఈ రాత్రికే రెండో టీ20..
కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన తొమ్మిదిమంది క్రికెటర్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసొలేషన్‌లోకి పంపించినట్లు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారంతా ఇక రెండు, మూడో టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కమిటీ నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిపింది. ఈ రాత్రికి రెండో టీ20 ఆరంభం కావాల్సి ఉన్న సమయంలో బీసీసీఐ ఎలా రీప్లేస్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

తొమ్మిది మంది క్రికెటర్లు.. ఐసొలేషన్‌లో
ఈ తొమ్మిదిమంది క్రికెటర్ల జాబితాలో ఓపెనర్లు పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ ఉన్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యాతో ఆయా క్రికెటర్లందరూ సన్నిహితంగా మెలిగినట్లు బీసీసీఐ భావిస్తోందని స్పష్టం చేసింది. కృనాల్‌కు కరోనా వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే అతనితో కలిసి తిరిగిన ఎనిమిది మందికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించింది. వారందరికీ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.

మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టింగులు..
మళ్లీ ఈ ఉదయం కూడా టీమిండియా, శ్రీలంక క్రికెటర్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించింది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తొమ్మిది మంది భారత క్రికెటర్లను ఐసొలేషన్‌లోకి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇవ్వాళ్టి రెండో టీ20 జరిగి తీరుతుందని, ఐసొలేషన్‌లోకి పంపించిన క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ కమిటీ ప్రతినిధిని ఆ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో ఉటంకించింది.

బయో బబుల్ ఎలా బ్రేక్..
కాగా- కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యా సిరీస్ మొత్తానికీ దూరం అయ్యారు. శ్రీలంక కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుగుణంగా అతను ఐసొలేషన్‌లో ఉంటోన్నాడు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన వెంటనే అతణ్ని అక్కడి అధికారులు ఐసొలేషన్‌కు తరలించారు. రెండు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బయో బబుల్ సెక్యూర్‌లో ఉంటోన్నాయి. వైరస్ బారిన పడకుండా హోటల్ స్టాఫ్ సహా.. వారికి సేవలను అందించే ప్రతి ఒక్కరూ బయో బబుల్ సెక్యూర్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనూ కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన ఎలా పడిగలిగాడనే విషయం అంతుచిక్కట్లేదని శ్రీలంక క్రికెట్ కమిటీ తెలిపింది. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications












