శ్రీలంక పర్యటనలో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పల్లెకెలె వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవరల్లో తొమ్మిది వికెట్లకు 161 పరుగులు చేసింది. కుశాల్ పెరెరా (53; 34 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.
రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్‌కు 6/0తో ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది .దీంతో లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే ఛేదించింది.

యశస్వీ జైస్వాల్ (30; 15 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (26; 12 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), హార్దిక్ పాండ్య (22 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు విజయానికి గల కారణాలను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. చిన్న-పెద్ద లక్ష్యం అని తేడా లేకుండా ఇదే జోరుతో బ్యాటింగ్ చేస్తామని అన్నాడు. ఆటగాళ్ల గొప్ప ప్రదర్శనతో పాటు వర్షం కూడా తమకు కలిసొచ్చిందని తెలిపాడు.
''ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కోరుకుంటున్నామని ఈ సిరీస్ ఆరంభం కాకముందే చెప్పాం. లక్ష్యం చిన్నది అయినా, పెద్దది అయినా ఇదే జోరుతో ఛేదన పూర్తిచేస్తాం. ఇక్కడ పరిస్థితుల్లో 160 కంటే తక్కువ స్కోరును సౌకర్యవంతంగా ఛేదించవచ్చు. మా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక మావైపు అదృష్టం కూడా ఉంది. వర్షం మాకు సహకరించింది. వచ్చే ఆఖరి టీ20 తుదిజట్టు గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం'' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
భారత్, శ్రీలంక జట్లలో కొత్త కెప్టెన్లతో పాటు కొత్త కోచ్ వచ్చిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్-గౌతమ్ గంభీర్‌కు, అసలంక-సనత్ జయసూర్యకు కూడా ఇదే తొలి సిరీస్. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు ఆఖరి మ్యాచ్ జరనుగంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.