పల్లెకెలె వేదికగా శ్రీలంకతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో ఘన విజయం సాధించింది. కుర్రాళ్ల అద్భుత పోరాటం, సూర్యకుమార్ యాదవ్ గొప్ప కెప్టెన్సీతో ఓటమి కోరల్లో నుంచి టీమిండియా బయటపడి గెలిచింది. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 137 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. రియాన్ పరాగ్ (26; 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (25; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. ఓ దశలో భారత్ స్కోరు 30/4, 48/5 మాత్రమే. ఈ స్థితిలో గిల్-పరాగ్-సుందర్ బ్యాటుతో గొప్ప పోరాటం చేశారు.

ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్ ఓవర్‌లో లంక 3 బంతుల్లో 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో భారత్ తొలి బంతికే బౌండరీ బాది విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు దారి తీస్తుందని, భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఛేజింగ్‌లో లంక 15 ఓవర్లకు 108/1తో పటిష్టస్థితిలో నిలిచింది. ఆఖరి అయిదు ఓవర్లలో 30 పరుగులు అవసరం. చేతిలో తొమ్మిది వికెట్లు.
కానీ భారత బౌలర్లు 22 పరుగులే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడం విశేషం. వాషింగ్టన్ సుందర్ (2/23) విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. తాను కెప్టెన్‌ను కావాలనుకోవాలట్లేదని, లీడర్‌ను అవ్వాలనుకుంటున్నానని చెప్పాడు.
''ఆఖరి ఓవర్లో బౌలింగ్ కంటే.. 30/4, 48/5 స్థితిలో నుంచి మా కుర్రాళ్లు గొప్పగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను లాగేసుకున్నారని భావిస్తున్నా. ఈ పిచ్‌పై 140 సగటు స్కోరు. ఫీల్డింగ్ సమయంలో మా ఆటగాళ్లతో.. 'ఇలాంటి మ్యాచ్‌లను నేను చూశాను. గంటన్నర పాటు మనం మనసు పెట్టి ఆడితే చాలు' అని చెప్పాను. మా ఆటగాళ్ల నైపుణ్యం, ప్రతిభ నా పనిని సులువు చేసింది. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఎంతో బాగుంది. ఓ ఆటగాడి ప్రదర్శనను జట్టు మొత్తం ఆస్వాదిస్తుంది. ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందు చెప్పాను. నేను కెప్టెన్ కావాలనుకోవట్లేదు. నాయకుడి అవ్వాలనుకుంటున్నా'' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.