మైదానంలోకి దూసుకొచ్చిన అభిమానులు
ఆదివారం మొదటి సెషన్‌లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా మహమ్మద్ షమీ వేసిన ఓ బంతికి కుశల్ మెండిస్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతనికి మైదానంలోనే చికిత్స అందిస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాలరీల నుంచి ముగ్గురు ప్రేక్షకులు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది గమనించిన భద్రత సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం భద్రతా సిబ్బందిని దాటుకుని మరి విరాట్ కోహ్లీ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు.

కోహ్లీతో సెల్ఫీ
అంతేకాకుండా తన మొబైల్‌ను బయటకు తీసి విరాట్ కోహ్లీని సెల్ఫీ ఇవ్వాలని కోరాడు. కాదనలేకపోయినా కోహ్లీ సెల్ఫీకి ఫోజు ఇవ్వడంతో అతడు ఫోటో తీసుకున్నాడు. అనంతరం భద్రతా సిబ్బందికి దొరకకుండా మళ్లీ మైదానంలో పరుగులు పెట్టాడు. ఎట్టకేలకు అతడితోపాటు మిగతా ఇద్దరిని పట్టుకున్న భద్రతా సిబ్బంది వారిని మైదానం నుంచి బయటికి తీసుకెళ్లారు. ఇది చూసిన గ్యాలరీల్లోని అభిమానులంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.

ఇది అభిమానుల భావోద్వేగం
దీనిపై టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా వర్చువల్ సమావేశంలో స్పందించాడు. ఇది తాము నియంత్రించలేని చర్యగా పేర్కొన్నాడు. అలాగే భద్రతా సమస్య కూడా ఒక కారణంగా చెప్పాడు. మ్యాచ్ మధ్యలో ఆకస్మాత్తుగా కొందరు మైదానంలోకి పరిగెత్తుకుంటూ రావడం తాము గమనించినట్లు తెలిపాడు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోని వారిని అడ్డుకున్నట్లు బుమ్రా చెప్పాడు. దీన్ని గురించి ఏం చెప్పాలో సరిగ్గా అర్థం కావడం లేదన్నాడు. ఆట క్రేజ్ అలా ఉంటుందని, కొన్ని సార్లు అభిమానులు ఇలా భావోద్వేగానికి గురవుతారని బుమ్రా పేర్కొన్నాడు.

కోహ్లీకి వీరాభిమానులు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం విరాట్ కోహ్లీ ఒక రకంగా హోంగ్రౌండ్‌గా చెప్పవచ్చు. ఐపీఎల్‌లో మొదటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్న కోహ్లీకి బెంగళూరు హోంగ్రౌండ్‌గా మారిపోయింది. 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్‌గా కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీకి బెంగళూరులో భారీగా అభిమానులు ఉన్నారు. శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.
కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు గ్యాలరీలన్నీ అతని నామస్మరణతో మార్మోగాయి. ఇదే వీరాభిమానం పలువురు మైదానంలోకి వచ్చేలా చేసింది. కాగా పింక్ బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఆ జట్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే మరో 419 పరుగులు చేయాల్సి ఉంది


Click it and Unblock the Notifications












