IND vs SL 2nd ODI: శ్రీలంకలో పర్యటిస్తోన్న భారత జట్టు.. రెండో వన్డేకు సిద్ధమైంది. హైడ్రామా మధ్య తొలి వన్డే టైగా మారిన నేపథ్యంలో ఈ గేమ్‌పై గురిపెట్టింది. ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరంభం కానుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌పై పట్టు సాధించినట్టే అవుతుంది. మూడో వన్డే ఓడినా సిరీస్ టైగా ముగుస్తుంది.
తొలి వన్డే అనూహ్యంగా టైగా మారిన విషయం తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది టీమిండియా. సరిగ్గా 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకా 13 బంతులు మిగిలివున్నప్పటికీ.. విజయానికి అవసరమైన ఆ ఒక్క పరుగును అందుకోలేక చతికిలపడింది.

రెండో వన్డే కోసం ఒక మార్పు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది టీమిండియాలో. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ఖలీల్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. టీ20లతో పాటు తొలి వన్డే ఆడిన సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. శివందుబేకు బదులుగా రియాన్ పరాగ్‌కు తుదిజట్టులో చోటు దక్కొచ్చు.
అదే సమయంలో శ్రీలంక కూడా ఓ కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయపడటం, సిరీస్‌కు దూరం కావడం వల్ల వెటరన్ బౌలర్ జెఫ్రీ వాండర్సేకు జట్టులోకి తీసుకుంది. హసరంగ స్థానాన్ని వాండర్సేతో భర్తీ చేసింది. భారత్‌తో జరిగే రెండో వన్డే కోసం తుదిజట్టులో అతని స్థానాన్ని ఖరారు చేసింది లంక క్రికెట్ బోర్డ్.
ఇప్పటివరకు 22 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు వాండర్సే. 20 వికెట్లను పడగొట్టాడు. 4/10 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. ఎకానమీ కూడా ఫర్వాలేదనిపించేలా ఉంది. ఓవర్‌కు సగటున 5.54 పరుగులను ఇచ్చుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నందున బోర్డు ఈ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసింది.
రెండో వన్డే ఆడబోయే శ్రీలంక తుదిజట్టులో- పాథుమ్ నిశ్శంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, మహ్మద్ షిరాజ్, అసిత ఫెర్నాండోలకు చోటు దక్కే అవకాశం ఉంది.
టీమిండియా ప్లేయింగ్ 11లో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే/రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్/హర్షిత్ రాణా/ఖలీల్, అర్ష్‌దీప్ సింగ్ ఆడొచ్చు.