గబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. ఆతిథ్య జట్టు 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
అయితే తుది జట్టులో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా మరో నాలుగు టీ20 మ్యాచ్ లే ఆడనున్న నేపథ్యంలో మితిమీరిన ప్రయోగాలపై మండిపడ్డారు.

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ''మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు బదులుగా తిలక్ వర్మ వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాలో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ ఉన్నారు. కానీ సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ లో చూడండి.. ఒకరు లెఫ్ట్ హ్యాండర్, మరొకరు రైట్ హ్యాండర్. భారత్ బ్యాటింగ్ స్టైల్ లో ఇదే అతిపెద్ద మార్పు. అయితే అవి వన్డేలు, ఇవి టీ20లు. వన్డే బ్యాటింగ్ లైనప్ నుంచి మార్పు కోసం ఇలా ట్రై చేస్తున్నారో లేదా మెరిట్ తో ఆటగాళ్లను ఎంపిక చేశారో తెలియదు. కానీ రుతురాజ్, శ్రేయస్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది'' అని మంజ్రేకర్ వివరించాడు.
పీయుష్ చావ్లా మాట్లాడుతూ.. ''ఆస్ట్రేలియా సిరీస్ లో రవి బిష్ణోయ్ గొప్పగా రాణించాడు. అంతేగాక ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచాడు. అతడిని జట్టులో ఎంపిక చేయాల్సింది. బెంచ్ కి పరిమితమవ్వడం అతడిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది'' అని అన్నాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ''శ్రేయస్ ను పక్కన పెట్టడం గురించి నాకేం అర్థం కావట్లేదు. చివరి టీ20లో అతడు హాఫ్ సెంచరీ సాధించాడు. లెఫ్ట్ హ్యాండర్ కోసం తీసుకోలేదా? లేదా శ్రేయస్ కు గాయమైందా? దీని గురించి టీమ్ మేనేజ్మెంట్ కే తెలియాలి. ఇక ప్రపంచ నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను తుదిజట్టు నుంచి తప్పించారు. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్, టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వాలి'' అని పేర్కొన్నాడు.