టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టైటిల్ పోరులో ఓ దశలో టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికా విజయానికి 24 బంతుల్లో 26 పరుగులు అవసరమయ్యాయి. హెన్రిచ్ క్లాసెన్ మంచి ఊపులో ఉన్నాడు. మరో ఎండ్‌లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. ఈ స్థితిలో పంత్ తెలివిగా వ్యవహరించి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు.
క్లాసెన్ మూమెంట్‌ను స్లోడౌన్ చేయాలని పంత్ మోకాలి నొప్పి అంటూ ఆటను కాసేపు ఆపేశాడు. విరామం రావడంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు లయ తప్పారు. బ్రేక్ అనంతరం తొలి బంతికే క్లాసెన్ ఔటయ్యాడు. అదే తరహా వ్యూహాన్ని సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అమలు చేశాడు. అసలేం జరిగిందంటే..

సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. సాధారణంగా ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే. కానీ అంతకుముందు ఓవర్‌లోనే మార్కో జేన్సన్ విధ్వంసం సృష్టించి 26 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఆఖరి ఓవర్‌ను ఆరంభించాడు. తొలి బంతికి కొయెట్జీ సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్‌కు వచ్చిన జేన్సన్ సిక్సర్ బాదాడు. అయితే బౌండరీ లైన్‌లో దాన్ని అందుకోవడానికి తిలక్ వర్మ ప్రయత్నించి కిందపడ్డాడు. ఈ క్రమంలో నేలకు తల బలంగానే తాకింది.
కంకషన్ టెస్టు అనంతరం తాను బాగానే ఉన్నానని, మ్యాచ్ కొనసాగించమని తిలక్ వర్మ పేర్కొన్నాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ అంత త్వరగా మ్యాచ్‌ను తిరిగి ఆరంభిచనివ్వలేదు. వైద్యులతో నిశితంగా పరిశీలించేలా చేశాడు. ఈ క్రమంలో జేన్సన్ మూమెంట్ స్లో డౌన్ అయ్యింది. అర్షదీప్ వేసిన తర్వాతి బంతికే వికెట్లముందే దొరికిపోయాడు. దీంతో భారత్ విజయం ఖరారైంది.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది. జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడారు. అర్షదీప్ సింగ్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశారు.