కేప్ టౌన్‌లో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. అంతేగాక సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 62 పరుగులకు మూడు వికెట్లు కూడా కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ కంటే 36 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా ఉంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి 23.2 ఓవర్లలోనే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించగా, బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టాప్ స్కోరర్‌గా వెరీన్ (15) నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టాప్ స్కోరర్‌గా విరాట్ కోహ్లి (46) నిలిచాడు.

టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం. అయితే 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టు స్కోరులో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది.
ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత్-దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట గురించి స్పందిచాడు. మొదటి రోజు 23 వికెట్లు పడటం తనని షాకింగ్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు. ''తొలి రోజు ఆటలో 23 వికెట్ల పడటంతో 2024 ఏడాది మొదలైంది. ఇది అవాస్తవం అనిపిస్తుంది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయినప్పుడు విమానం ఎక్కాను. ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసేలోపు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి మూడు వికెట్లు కూడా కోల్పోయింది. అసలు నేనేం మిస్ అయ్యాను?'' అని సచిన్ ట్వీట్ చేశాడు.
కాగా, ఆట ముగిసేసరికి 62/3తో ఉన్న సౌతాఫ్రికా ఇంకా 36 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో మార్క్‌రమ్ (36), బెండింగ్‌హమ్ (7) ఉన్నారు. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.