భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆఖరి వన్డేలోనూ దక్షిణాఫ్రికాపై గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 215 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (61; 57 బంతుల్లో, 7 ఫోర్లు) టాప్ స్కోరర్.
ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (38; 66 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) కీలక పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/7), అరుంధతిరెడ్డి (2/36) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో టీమిండియా 40.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (90; 83 బంతుల్లో, 11 ఫోర్లు) మరోసారి చెలరేగింది. అయితే హ్యాట్రిక్ సెంచరీలను తృటిలో కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (42; 48 బంతుల్లో, 2 ఫోర్లు) సత్తాచాటింది.

అయితే దక్షిణాఫ్రికాపై పరుగుల వరద పారించిన స్మృతి మంధాన అరుదైన రికార్డు నెలకొల్పింది. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 117 పరుగులు చేసిన స్మృతి రెండో మ్యాచ్‌లో 136 పరుగులు చేసింది. మొత్తంగా 114 సగటుతో మూడు మ్యాచ్‌ల్లో343 పరుగులు చేసింది.
ఇక ద్వైపాక్షిక సిరీస్‌లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆరో మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు నెలకొల్పింది.ఈ జాబితాలో ఆమెపై ఉన్న బ్యాటర్లు అందరూ అయిదు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్ ఆడారు. కాగా, దక్షిణాఫ్రికాతో భారత్ జూన్ 28 నుంచి చెన్నై వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. టెస్టు మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు చెన్నై వేదికగానే జరగనున్నాయి. జులై 5న తొలి టీ20, జులై 7న రెండో మ్యాచ్, జులై 9వ తేదీన ఆఖరి టీ20 జరగనుంది.