దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్‌ను భారత్ ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి సఫారీలను చిత్తు చేసింది. శతకంతో కదం తొక్కిన సంజు శాంసన్ (107; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ టాప్ స్కోరర్. తిలక్ వర్మ (33; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (21; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జి మూడు వికెట్లు, మార్కో జేన్సన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది.

హెన్రిచ్ క్లాసెన్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కొయెట్జి (23; 11 బంతుల్లో, 3 సిక్సర్లు), రికెల్టన్ (21; 11 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లుతో చెలరేగారు. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ తీశారు. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమి గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలు వివరించాడు. ఛేదనలో శుభారంభం దక్కకపోవడం, సంజు శాంసన్ విధ్వంసం తమ పరాజయానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తప్పుడు నిర్ణయంగా భావించట్లేదని మార్క్‌రమ్ చెప్పాడు. ''టాస్ ప్రభావం చూపించిందని అనుకోవట్లేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కొత్త బంతులకు ఎక్స్‌ట్రా బౌన్స్ లభించాయి. బంతి పాతైన తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలమైంది. అయితే మేం మెరుగ్గా ఛేదన ఆరంభించాల్సి ఉంది. అక్కడే మేం మ్యాచ్‌ను కోల్పోయాం. సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతన్ని ఆపలేకపోయాం. శాంసన్‌కు హ్యాట్సాఫ్. ఇక డెత్ ఓవర్లలో మా బౌలర్లు కొయెట్జి, జేన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. గ్రూప్‌గానే కాకుండా వ్యక్తిగతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చే మ్యాచ్‌లో సత్తాచాటుతాం'' అని మార్క్‌రమ్ అన్నాడు. ఆదివారం సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది.