
విశాఖ: గత కొంతకాలంగా రవీంద్ర జడేజా బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొడుతూ భారత జట్టులో కీలక ఆటుగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనతో మూడు ఫార్మాట్‌లలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. జడేజా బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా అద్భుతాలు చేస్తాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అద్భుత ఫీల్డర్ అంటే టక్కున జడేజానే గుర్తొస్తాడు. బంతి తనవైపు వచ్చిందంటే మెరుపు వేగంతో వికెట్లను గిరాటేస్తాడు. మరోవైపు స్టన్నింగ్ క్యాచ్‌లు కూడా పడతాడు. తాజాగా జడేజా ఒంటిచేత్తో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఎవరికీ సాధ్యంకాని రీతిలో బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.
విశాఖ టెస్టులో భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆది నుంచి తడబడుతూనే ఉంది. ఈక్రమంలో జడేజా వేసిన 26.1వ బంతిని అయిడెన్ మార్కరమ్ స్ట్రైట్ డ్రైవ్‌ను కొట్టే యత్నం చేశాడు. తనపైకి దూసుకొస్తున్న బంతిని చూసి వెంటనే స్పందించిన జడేజా.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. రెప్పపాటులో జడేజా క్యాచ్ అందుకోవడంతో మార్కరమ్ నోరెళ్లబెట్టి నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో ఫిలిండర్, మహరాజ్‌లను కూడా జడేజా ఔట్ చేసాడు. భారత్ మ్యాచ్ గెలవడంలో ఈ క్యాచ్ టర్నింగ్ పాయింట్.
ప్రస్తుతం జడేజా క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో జడేజా 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పేసర్ మొహమ్మద్ షమీకి చక్కటి సహకారం అందించాడు. జడేజా గతంలో కూడా అసాధ్యం అనిపించే క్యాచ్‌లెన్నో పట్టుకున్నాడు.
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెలరేగి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. సొంత గడ్డపై ఏడాది జరిగిన టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. పుణేలో ఈ నెల 10 నుండి రెండో మ్యాచ్ జరగనుంది.