|
కీపర్ క్యాచ్‌గా..
కగిసో రబడా వేసిన 43వ ఓవర్ తొలి బంతికి రహానే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రబడా వేసిన లెంగ్త్ బాల్‌ను డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. కోహ్లీ సూచనలతో రహానే రివ్యూ తీసుకున్నాడు. కానీ టీవీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్... అల్ట్రా ఎడ్జ్‌లో సైక్ ఉండటం గమనించి ఔటిచ్చాడు. దాంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ మధ్య కాలంలో రహానే ఒకే తరహాలో ఔటవ్వడం విమర్శలకు తావిస్తోంది.
|
రహానే కథే ఇంత..
ఇక భారత అభిమానులు అయితే రహానేపై మండిపడుతున్నారు. ఇలా విఫలమవడం రహానేకు కొత్త కాదని, ఒక మ్యాచ్ ఆడటం ఆ తర్వాత 10 ఇన్నింగ్స్‌లు విఫలమవడం అతనికి అలవాటేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఆటతోనే రహానే గొప్ప ఆటగాడు కాలేకపోయాడని విమర్శిస్తున్నారు. జట్టు నుంచి వేటు వేస్తారనే సమయానికి సెంచరీ, హాఫ్ సెంచరీతో బాదుతాడని, ఆ తర్వాత మళ్లీ వరుసగా విఫలమవుతాడని గుర్తు చేస్తున్నారు.
|
హనుమ విహారికి చోటివ్వండి..
ఇక రహానేకు ఉద్వాసన పలికి తెలుగు క్రికెటర్ హనుమ విహారికి అవకాశం ఇవ్వాలని అభిమానులు సూచిస్తున్నారు. రహానేకు ఇచ్చిన మాదిరే విహారికి అవకాశాలిస్తే అతను కీలక ఆటగాడిగా ఎదిగేవాడని కామెంట్ చేస్తున్నారు. రెండో టెస్ట్ బరిలోకి దిగిన విహారి పర్వాలేదనిపించాడని, రెండో ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు జోడించాడని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా తదుపరి సిరీస్‌ల్లో విహారికి చోటివ్వాలని హితవు పలుకుతున్నారు.
|
కోహ్లీ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(12), మయాంక్ అగర్వాల్(15) దారుణంగా విఫలమవ్వగా.. చతేశ్వర్ పుజారా(43)పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత రహానే(9), రిషభ్ పంత్(27), రవిచంద్రన్ అశ్విన్(2) కూడా నిరాశపరిచారు. దాంతో భారత్ 175 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కోహ్లీ పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓలివర్ బౌలింగ్‌లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.