IND vs SA: వైజాగ్ టెస్ట్.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని అరెస్ట్!!

వైజాగ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. కోహ్లీ, ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచారు. దీంతో అభిమానులు వారిని కలవాలని చూస్తుంటారు. తన అభిమాన క్రికెటర్లను కలవాలని ఒక్కోసారి అభిమానులు సాహసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా విశాఖ టెస్టులో జరిగింది.

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని:
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి టెస్టులో మూడో రోజైన శుక్రవారం ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తమ అభిమాన క్రికెటర్లను కలుసుకునేందుకు ఫెన్సింగ్ దాటి మైదానంలోకి దూసుకువచ్చాడు. అంతేకాదు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు యత్నించాడు. ఇది గమనించిన మైదాన సిబ్బంది.. అతన్ని అడ్డుకోవడానికి యత్నించడంతో పరుగులు తీశాడు. చివరకు ఆ అభిమానిని పట్టుకున్న సిబ్బంది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఇది మొదటిసారేం కాదు:
ఇలా అభిమానులు మైదానంలోకి దూసుకురావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను కలవడానికి వారి అభిమానులు మైదానంలోకి వచ్చారు. గతేడాది హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి అభిమాని ముద్దిచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై-బీహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని రోహిత్‌ను ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు. ఇక ధోనీ అభిమానులు అయితే చాలా సార్లే వచ్చి అతని పాదాలు తాకి వెళ్లారు.

డికాక్ మెరుపు శతకం:
ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా గొప్పగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను తడబడుతూ ఆరంభించిన ప్రొటీస్ శుక్రవారం ఆటలో దుమ్ములేపింది. మొదటగా డీన్ ఎల్గర్ సెంచరీ, కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలు చేయగా.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మెరుపు శతకంతో చెలరేగాడు. అశ్విన్ వేసిన 105వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాది సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఓపెనర్ డీన్ ఎల్గర్(160)తో భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ప్రొటీస్ ఫాలో ఆన్ తప్పించుకుంది. దక్షిణాఫ్రికా 109 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ (111), ముత్తుసామి (5) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు 132 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications