పార్ల్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) అరుదైన ఘనతను అందుకున్నారు. నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.
అయితే టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతకు ముందు సెంచూరియన్‌లో 2013లో డికాక్, డివిలియర్స్ నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు భాగస్వామ్యంగా ఉండగా.. తాజాగా బవుమా, డస్సెన్ ఆ రికార్డును అధిగమించారు. 1996లో గ్యారీ కిర్‌స్టన్, క్రోంజే షార్జా 154 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఇక ఓవరాల్‌గా భారత్‌పై బవుమా, డస్సెన్లది రెండో అత్యధిక పార్ట్నర్షిప్. ఈ జోడీ కన్నా ముందు 2000లో కోచ్చి వేదికగా తొలి వికెట్‌కు కిర్ట్సెన్ - గిబ్స్ 235 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బవుమా, డస్సెన్ సూపర్ సెంచరీలతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ 72 పరుగులు సమర్పించుకొని కెరీర్లోనే అత్యంత చెత్త ప్రదర్శనను మూటగట్టుకున్నాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్(12) త్వరగా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో శిఖర్ ధావన్(84 బంతుల్లో 10 ఫోర్లతో 79) ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గబ్బర్.. కేశవ్ మహరాజ్ సూపర్ డెలవరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. విరాట్ కోహ్లీ(43 బ్యాటింగ్) జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. 26 ఓవర్ల ముగిసే సరికి భారత్ 2 వికెట్లకు 140 పరుగులు చేసింది.