IND vs SA: రహానే సంచలన వ్యాఖ్యలు.. రోహిత్ ఓపెనింగ్ చేస్తాడో లేదో తెలీదు?

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడో లేదో నాకు తెలీదు? అని టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే రోహిత్ శర్మ టెస్టుల్లో ఓపెనర్‌గా రాణిస్తాడని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవడం.. మాజీల మద్దతు ఉండడంతో రాహుల్ స్థానంలో రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. అక్టోబర్ 2 నుండి ప్రారంభమయ్యే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ సమయంలో రహానే ఇలా మాట్లాడడం విశేషం.

ఓపెనింగ్ చేస్తాడో లేదో:
తాజాగా రహానే మాట్లాడుతూ... 'రోహిత్ ఓపెనింగ్ చేస్తాడో లేదో నాకు తెలీదు. అది కెప్టెన్ నిర్ణయం. ఒకవేళ రోహిత్ ఓపెనింగ్ చేస్తే మాత్రం నేనెంతో సంతోషిస్తా. రోహిత్ లాంటి వ్యక్తి రిజర్వు బెంచీపై కూర్చొని ఉంటే చూడటం చాలా కష్టం. ఇదే విషయాన్నీ వెస్టిండీస్ సిరీస్‌లోనే చెప్పా. రోహిత్ ఎంతో కష్టపడ్డాడు. అతడికి అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా రాణిస్తాడు' అని అన్నాడు.

వన్డేల్లో పునరాగమనం చేస్తా:
'టెస్టు క్రికెట్ అంతా ఆలోచనా ధోరణికి సంబంధించింది. వన్డేల్లో నమ్మకంతో ఆడితే సరిపోతుంది. కానీ టెస్టుల్లో అలా కుదరదు. కొన్నిసార్లు ఒకేసారి ఇద్దరు బౌలర్లు అద్భుతమైన స్పెల్స్ వేస్తారు. వారిని గౌరవించాలి. ఆ తర్వాత మన ఆట ఆడాల్సి ఉంటుంది. టెస్టు క్రికెట్‌తో పాటు వన్డే క్రికెట్‌ను నేనెంతో ఆస్వాదిస్తా. వన్డేల్లో పునరాగమనం చేయాలని అనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టంతా దక్షిణాఫ్రికా సిరీస్‌పైనే. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌పై దృష్టి పెడుతా' అని రహానే పేర్కొన్నాడు.

రెండు నెలలు ఎంతో నేర్చుకున్నా:
ప్రపంచకప్‌నకు ఎంపిక కానందుకు బాధపడ్డా. అనంతరం కౌంటీ క్రికెట్ ప్లాన్ చేసుకున్నా. హాంపషైర్ జట్టు తరఫున ఆడా. ఇంగ్లాండ్‌లో ప్రతి రోజు సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ.. క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో నా ఆలోచనలు ఎలా ఉండేవో గుర్తుచేసుకునే వాడిని. ఫలితం గురించి కాకుండా ఆడటాన్నే ఆస్వాదించేవాడినని తెలుసుకున్నా. ఆ రెండు నెలలు ఎంతో నేర్చుకున్నా' అని రహానే తెలిపాడు.

బౌలర్లను గౌరవించాలి:
'వెస్టిండీస్‌లో డ్యూక్స్ బంతులతో ఆడతామని తెలుసు. అలాగే నన్ను నేను నమ్మా. పరుగులు చేయాలని అనుకున్నా. అనుకున్నట్టుగానే ఆ పర్యటనలో రాణించా. ప్రస్తుతం పోటీ అధికంగా ఉంది. తక్కువ అవకాశాల్లోనే మనమేంటో నిరూపించుకోవాలి. దక్షిణాఫ్రికాలో రబాడ, కేశవ్ మహరాజ్ వంటి మంచి బౌలర్లు ఉన్నారు. పరిస్థితులతో సంబంధం లేకుండా వారు వికెట్లు తీస్తారు వారిని గౌరవించాలి' అని రహానే చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications