చేతులారా ఓడిపోవడం అంటే ఇదే మరి: టీమిండియా ఓటమికి ఆ 5 కారణాలివే

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో మట్టి కరిచింది. 200లకు పైగా స్కోర్ చేసినప్పటికీ.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. కొండంత లక్ష్యాన్ని ప్రొటీస్ కొట్టి అవతల పారేసింది. దీన్ని బట్టి చూస్తే- మనోళ్ల బౌలింగ్, ఫీల్డింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారీ స్కోర్ చేసినా..
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నమెంట్‌లో ఫ్లాప్ షో కనపరిచిన ఇషాన్ కిషన్.. ఈ మ్యాచ్‌లో అద్భుతాలు సృష్టించాడు. తొలి మ్యాచ్‌లోే అర్ధసెంచరీ నమోదు చేశాడు. 48 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా 30కి పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

బౌలింగ్.. అధ్వాన్నం..
ప్రత్యర్థికి 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చి- బ్యాటర్లు తమ పని తాము పూర్తి చేశారు గానీ.. బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులను సంధించలేకపోయారు. ఒక్కో బౌలర్ సగటున ఓవర్‌కు 10 పరుగులు చొప్పన సమర్పించుకున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మూకుమ్మడిగా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ విఫలమైంది. ఫ్లాప్ షో ఇచ్చింది.

ప్రారంభ ఓవర్లలోనే వికెట్ పడగొట్టినా..
ఇన్నింగ్ మూడో ఓవర్‌కే టీమిండియా బౌలర్లు వికెట్ పడగొట్టారు. ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మూడో ఓవర్ రెండో బంతికి కేప్టెన్ టెంబా బావుమా అవుట్ అయ్యాడు. రెండు ఫోర్లతో దూకుడుమీదున్న బావుమాను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ దారి పట్టించాడు. ఆరో ఓవర్‌లో మరో వికెట్ పడింది. ఈ సారి డ్వైన్ ప్రిటోరియస్ బలి అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 61 పరుగులే.

అదే చివరిది..
స్కోర్ బోర్డుపై మరో 20 పరుగులు జమ అయిన తరువాత అంటే.. 81 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ కూడా అవుట్ అయ్యాడు. ఇక వికెట్లు వరుస కడతాయని ఆశించిన సగటు టీమిండియా అభిమానికి ఆ తరువాత అంతా చుక్కలే కనిపించాయి. 81 పరుగుల వద్ద నేలకూలిన డికాక్ వికెట్టే చివరిది.

ధారాళంగా పరుగులు..
తొమ్మిదో ఓవర్ 4 బంతికి డికాక్ అవుట్ అయిన తరువాత.. ఇక మరో వికెట్ తీసుకోవడం భారత బౌలర్ల వల్ల కాలేదు మరి. క్రీజ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డెర్ డుస్సాన్.. దుమ్ము లేపారు. బౌలర్ల మత్తు వదిలించారు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన మిల్లర్.. అదే దూకుడును కనపరిచాడు. 31 బంతుల్లో అయిదు ఫోర్లు, నాలుగు బౌండరీలతో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డుస్సాన్.. మిల్లర్‌ను మించిపోయి ఆడాడు.

ఆ రెండు ఓవర్లలోనే..
17వ ఓవర్ ప్రారంభానికి ముందు ఉన్న సమీకరణం- 24 బంతుల్లో 56 పరుగులు. ఇన్నింగ్ మొత్తం మీద 17, 18 ఓవర్లలు హైలైట్‌గా నిలిచాయి. ఈ రెండు ఓవర్లల్లో అంటే 12 బంతుల్లో 44 పరుగులు పిండుకున్నారు డేవిడ్ మిల్లర్-డుస్సాన్. పోటీ పడి ఆడారు. హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు డుస్సాన్. భువనేశ్వర్ కుమార్ సంధించిన ఆ తరువాతి ఓవర్‌లోనూ అదే పరిస్థితి. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో మొత్తంగా 22 పరుగులొచ్చాయి. ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి.

క్యాచ్ డ్రాప్..
డుస్సాన్ 30 పరుగుల వద్ద ఉన్న సమయంలో అవుట్ అయ్యే ఛాన్స్ నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ్రేయాస్ అయ్యర్ నేలపాలు చేశాడు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంది టీమిండియా. లైఫ్ పొందిన అదే డుస్సాన్.. 46 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాకు ఓటమిని పరిచయం చేశాడు. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడం వరుసగా ఇది ఆరోసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications