
తొలి టీ20లో హర్యానా సంచలనం షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ (15 ఏళ్ల 239 రోజులు) గుర్తింపు పొందింది. గతంలో గార్గి బెనర్జీ 14 ఏళ్ల 162 రోజుల వయసులో (1978లో) భారత్‌కు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది. అయితే అరంగేట్ర మ్యాచ్‌లో షఫాలీ వర్మ నాలుగు బంతులను ఎదుర్కొని డకౌట్ అయింది.
మ్యాచ్‌కు ముందు బీసీసీఐ షఫాలీ వర్మకు సంబందించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. భారత క్రీడాకారిణిలు అందరూ షఫాలీ వర్మను అభినందించారు. ప్రతిఒక్కరు షఫాలీని కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరోవైపు కోచింగ్ సిబ్బంది కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. 'ఈ రోజు టీంఇండియా తరపున అరంగేట్రం చేస్తున్న హార్డ్-హిట్టింగ్ బ్యాటర్ షఫాలి వర్మకు ఇది ఎంతో ముఖ్యమైన క్షణం. ఆమె వయసు 15 మాత్రమే' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆమె స్థానంలో షఫాలీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. దూకుడైన బ్యాటింగ్‌తో మిథాలీ సహా ఎంతో మంది ప్రశంసలు అందుకున్న యువ కెరటం షఫాలీ వర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైంది. అండర్-19, అండర్-23 దేశవాళీ క్రికెట్‌లో షఫాలీ 150కి పైగా స్ట్రయిక్ రేట్‌తో వేగంగా పరుగులు చేస్తూ భారత సెలెక్టర్ల దృష్టిలో పడింది. అలాగే ఆఫ్‌స్పిన్ కూడా వేయగలగడం ఆమెకు మరో బలం.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్, స్మృతి మందన (16 బంతుల్లో 4 ఫోర్లతో 21) రాణించారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. దీప్తి వేసిన తొలి మూడు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసింది. దీప్తి శర్మ (3/8)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.