జోహన్నెస్‌బర్గ్: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఎట్టకేలకు తమ వరుస వైఫల్యాలకు ఫుల్స్టాప్ పెట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు ఫ్లాఫ్ స్టార్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తమ కెరీర్‌కు చావో రేవోగా మారిన ఈ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. పుజారా అయితే తన శైలికి భిన్నంగా ఆడుతూ వేగంగా పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలోనే వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన పుజారా.. మూడో రోజు ఆటలో అదే జోరును కొనసాగించాడు.
80 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ఓలివర్ వేసిన 30వ ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. పుజారాకు ఇది కెరీర్లోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. తాను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితోనే ఆడాడు. మరోవైపు రహానే సైతం ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా దూకుడు కనబర్చాడు. ఓలివర్ వేసిన 33వ ఓవర్లో వరుస బంతుల్లో రెండో బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం.. రబడా బౌలింగ్‌లో ఫోర్ బాదిన రహానే(78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58).. అదే ఓవర్ చివరి బంతికి కీపర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇద్దరూ 122 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.
ఇక రబడా వేసిన తన మరుసటి ఓవర్లోనే చతేశ్వర్ పుజారా(86 బంతుల్లో 10 ఫోర్లతో 53)ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులో రిషభ్ పంత్(0 బ్యాటింగ్), హనుమ విహారి(1 బ్యాటింగ్) ఉన్నారు. ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా ముఖ్యం. ప్రస్తుతం 37 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 163 పరుగులు చేయగా.. 136 పరుగుల ఆధిక్యం మాత్రమే ఉంది.
ఇక సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.