
కరాచీ: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ షూరు అయింది. మరో 24 గంటల్లో ఈ హై ఓల్టెజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఇరు జట్లకు ఇదే ఫస్ట్ మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత దాయాది దేశాలు రెండూ మళ్లీ తలబడనున్నాయి. దాంతో ఈ మ్యాచుపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది.
టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ తొలిసారి కెప్టెన్లుగా తలపడనున్నారు. పాకిస్తాన్‌పై తన అధిపత్యాన్ని కొనసాగించాలని కోహ్లీ భావిస్తుండగా.. ఎలాగైనా గెలవాలని బాబర్ పట్టుదలతో ఉన్నాడు. భారత్, పాక్ మ్యాచ్‌పై ఇరుదేశాల మాజీ ఆటగాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ యూనిస్ ఖాన్ స్పందించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ భారత్‌కు, మహ్మద్ రిజ్వాన్ పాక్‌కు మ్యాచ్ విన్నర్లు కాగలరని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలతో పాకిస్థాన్‌కు పెను ప్రమాదం పొంచిఉందని యూనిస్ ఖాన్ అంచనా వేశాడు.
'విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇరు జట్లకు ముఖ్యమైన ప్లేయర్స్. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు మహ్మద్ రిజ్వాన్ కూడా మ్యాచ్ విన్నర్లు కాగలరు. సహజంగానే బాబర్, కోహ్లీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే రోహిత్, రిజ్వాన్ వారిపై ఉండే ఒత్తిడిని కాస్త తగ్గిస్తారని నేను భావిస్తున్నా. మ్యాచ్-విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఇరు వైపుల పేస్ సమానంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా 'మెన్ ఇన్ గ్రీన్' కి కీలక ముప్పు. అయితే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి స్థితిలో ఉన్నారు. భారత్ పేస్ విభాగం ఇటివల కాలంలో కూడా గణనీయంగా మెరుగుపడింది' అని యూనిస్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, బాబర్‌కు పోలికే లేదన్నాడు. బాబర్ ఇంకా చిన్నవాడని తాను అభిప్రాయపడుతున్నట్లు యూనిస్ పేర్కొన్నాడు. కోహ్లీ 2008లో తాను ఆడుతున్నప్పుడు అరంగేట్రం చేశాడన్నాడు. రోహిత్, బుమ్రాతో పాక్ జాగ్రత్తగా ఉండాలని యూనిస్ హెచ్చరించాడు.
భారత్, పాక్ మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. అయితే టీ20 ఫార్మట్‌లో పాక్ రాణించే అవకాశం ఉందన్నారు. టీమిండియా ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే.. పాకిస్తాన్ కోహ్లీసేనకు సవాల్ విసురుతుందని తాను అనుకోను అని భారత మాజీ బౌలర్ అజిత్ అగర్కర్ అన్నాడు. అయితే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్‌ను తేలికగా తీసుకొవద్దన్నాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చని అజిత్ పేర్కొన్నాడు.