
దుబాయ్: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అదో థ్రిల్. దాయాదుల సమరం ఓ సూపర్ ఎన్‌కౌంటర్‌లా ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. ఇక మైదానంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు అయిదు సార్లు తలపడ్డాయి. ఆ ఐదు మ్యాచుల్లో టీమిండియాదే పైచేయి. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఇండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. పవర్‌ఫుల్ షాట్లతో ప్రేక్షకుల్ని అలరించే ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే తన ఆధిపత్యాన్ని చాటింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా నిలిచిన భారత్.. మరోసారి ఆ రికార్డును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం విజయం సాధించేందుకు తహతహలాడుతోంది.
మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీమిండియా మ్యాచ్ కోసం పాక్ 12 మంది జట్టును ప్రకటించింది. దీనిపై భారత సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు బలంగా కనిపిస్తోందన్నాడు. ప్రత్యర్థి జట్టుపై 100 శాతం గెలిచే అవకాశమున్నా.. ఆ జట్టును ఈ మాత్రం తేలికగా తీసుకోకూడదన్నాడు. పాక్ జట్టులో గేమ్ ఛేంజర్స్ ఉన్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 'పాకిస్థాన్ జట్టు బలమైంది. పాక్ జట్టులో గేమ్ ఛేంజర్స్ ఉన్నారు. వారిపై గొప్ప ప్రదర్శన చేయాలి. టాప్ ఆటగాళ్లతో గొప్పగా ఆడాలని భావిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పక విజయం సాధిస్తుందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు టీమిండియాను పాక్ ఓడించలేదు. కానీ అది గతం. ఇప్పుడు మేము దాన్ని తిరగరాయబోతున్నాం. అక్టోబరు 24న జరగనున్న మ్యాచ్‌లో విజయం మాదే. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించాం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోరని ఆశిస్తున్నా. టీమిండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నాం' అని బాబర్ అన్నాడు.
చివరగా భారత్-పాకిస్తాన్ జట్లు 2019 జూన్ 16న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం, ఈ సారి తలపడటం అది కూడా పొట్టి ప్రపంచకప్‌లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక చరిత్ర పరంగా చూస్తే.. ఇప్పటి వరకు భారత్-పాకిస్తాన్ జట్లు ఏడు సార్లు ప్రపంచకప్‌లో తలపడ్డాయి. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 ప్రపంచకప్‌లో కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌లో ఏడుసార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ చూస్తోంది.