
మెల్‌బోర్న్: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న బిగ్ డే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దీనికోసం రెండు జట్లూ సన్నద్ధం అయ్యాయి. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫైట్. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండట్లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రేక్షకులు ఎదురు చూస్తోన్నారు.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులకు వీక్షించడానికి సన్నద్ధం అయ్యారు. ఇదో రికార్డు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తి సామర్థ్యం లక్ష. లక్ష మంది ఒకేసారి మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇదివరకు చాలా అరుదుగా మాత్రమే ఈ స్థాయిలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిండింది.
మెల్‌బోర్న్‌లో వర్షం పడే అవకాశం ఉందంటూ ఇదివరకే ఆస్ట్రేలియా వాతావరణం విభాగం- బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అంచనా వేసింది గానీ.. పరిస్థితులు చాలావరకు మెరుగుపడ్డాయి. వర్షం పడటానికి అనుకూల వాతావరణం ఇప్పుడు లేదు. మ్యాచ్ కొనసాగడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. లా నినా ప్రభావంతో మెల్‌బోర్న్ సిటీ మొత్తం మీద భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చంటూ బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అయిదు రోజుల కిందటే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లా నినా విస్తరించిందని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతమౌతుందని వివరించింది. అదే జరిగితే- మెల్‌బోర్న్ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావొచ్చంటూ అప్పట్లో అంచనాలు వ్యక్తం అయ్యాయి గానీ- వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా కనిపించింది.
ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ సజావుగా సాగింది. ఇక మెల్‌బోర్న్ మ్యాచ్‌కూ ఎలాంటి అడ్డంకులూ లేవు. సాధారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా అరుదుగా జరగుతుంటుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లల్లో తప్ప ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండవు.
అలాంటిది ఈ రెండు నెలల వ్యవధిలో ఈ రెండు దేశాలు తలపడబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఆసియా కప్ 2022 తరువాత రెండు నెలల వ్యవధిలో మళ్లీ భారత్ - పాకిస్తాన్ తలపడబోతోన్నాయి.