
ముంబై: ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ 2022 పోరు ఆరంభం కాబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా 12 జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తలపడనున్నాయి. దీని కోసం భారత్ సన్నద్ధమౌతోంది. ఈ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఈ నెల 23వ తేదీన ఆరంభించనుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రెండు నెలల కిందటే ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్ తరువాత మళ్లీ ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి.
ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన ఆదివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్‌లో బ్లాక్ క్యాప్స్‌ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.
ఈ ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ 2022 ఆరంభం కాబోతోన్న నేపథ్యంలో- 16 జట్ల కేప్టెన్లందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అందరూ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అదే స్టేజ్‌పై పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్.. తన పుట్టినరోజును కూడా జరుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది 28వ జన్మదినం. బాబర్ ఆజమ్‌కు ఇతర జట్ల కేప్టెన్లందరూ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అతను కేక్ కట్ చేశాడు.
టీమిండియాతో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని బాబర్ వ్యాఖ్యానించాడు. రెండు జట్ల మధ్య పోరు అంటే రెండు దేశాల ప్రజల అకాంక్షలను ప్రతిఫలింపజేస్తాయని పేర్కొన్నాడు. భారత్-పాక్ మధ్య అరుదుగా మ్యాచ్‌లు జరగడం కూడా దీనికి ఓ కారణంగా తాను భావిస్తోన్నానని బాబర్ అభిప్రాయపడ్డాడు. షహీన్ షా ఆఫ్రిదీ, ఫకర్ జమాన్ జట్టులోకి పునరాగమనం ప్లస్ పాయింటేనని, వారిద్దరూ మ్యాచ్ విన్నర్లని చెప్పాడు. రోహిత్ శర్మ, అతని అనుభవాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాబర్ పేర్కొన్నాడు.