
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమైన టీ20 ప్రపంచ కప్ 2022లో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన అధికారిక వామప్ మ్యాచ్‌లో సత్తా చాటింది. ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ గడ్డపై చుక్కలు చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్‌లోనూ టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించారు. 186 పరుగుల లక్ష్యాన్ని అందుకోనివ్వకుండా ఆసీస్ ప్లేయర్లను కట్టడి చేశారు. చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ విజృంభణ ఏ రేంజ్‌లో సాగిందో చూశాం.
టీమిండియా ఇప్పుడు మరో వామప్ మ్యాచ్‌కు సిద్ధపడుతోంది. న్యూజిలాండ్‌ను ఢీ కొట్టబోతోంది. భారత కాలమానం ప్రకారం- బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. వామప్స్‌లల్లో ఇదే చివరి మ్యాచ్. దీని తరువాత సూపర్ 12 మొదలవుతుంది. 22వ తేదీ నుంచి సూపర్ 12 ఉంటుంది. ఈ దశలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొడుతుంది.
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య క్రికెట్‌లో ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే దానిపై ఏర్పడే అంచనాలు ఆకాశాన్ని అంటుతుంటాయి. క్రికెట్‌ను మించి- అనే పరిస్థితి ఏర్పడుతుంటుంది. రెండు దేశాల్లోనూ ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తారు. రెండు నెలల కిందటే ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన నేపథ్యం తోడు కావడం వల్ల ఈ సారి మరింత ఉత్కంఠతకు గురి చేస్తోందీ మ్యాచ్. ఆసియా కప్‌లో సంభవించిన పరాభవానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సి ఉంది టీమిండియాకు.
ఈ పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే, కుమార్తె సమైర శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారితో కలిసి బ్రిస్బేన్‌లో రోహిత్ శర్మ షాపింగ్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తుఫాన్ ముందు ప్రశాంతతలా కనిపిస్తోన్నాడు రోహిత్ శర్మ.