
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 దశ రసవత్తరంగా సాగుతోంది. మలి విడతలో కూడా సంచలన విజయాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తమ ప్రత్యర్థులను మట్టి కరిపించాయి. ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఘన విజయాలను అందుకున్నాయి. ఫైనల్స్ దిశగా తొలి అడుగు వేశాయి. ఈ రెండు జట్లు కూడా ప్రత్యర్థులను ఓడించిన తీరు హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేయడం ఆకట్టుకుంది.
ఇప్పుడు తాజాగా మెల్‌బోర్న్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తనకు బాగా అచ్చొచ్చిన ఛేజింగ్ వైపే రోహిత్ శర్మ మొగ్గు చూపాడు. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడం.. ఆ తరువాత సునామీలా విరుచుకుపడటం అనే ప్రాథమిక సూత్రాన్ని రోహిత్ శర్మ అనుసరిస్తూ వస్తోన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చాలా మ్యాచ్‌లల్లో జరిగిందిదే.
టాస్ గెలిస్తే- ఫీల్డింగ్ ఎంచుకోవడం అనేది ఓ ఆనవాయితీగా తీసుకొస్తోన్నాడీ కేప్టెన్. మెజారిటీ మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తో కేప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు. అదీ టీమిండియా ప్లేయర్‌గా. ఇప్పటివరకు మరే ఆటగాడికీ అది సాధ్యం కాలేదు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అన్నింట్లోనూ భాగస్వామి అయ్యాడు రోహిత్ శర్మ.
2007లో ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాగా..అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నింట్లోనూ అతని కాంట్రిబ్యూషన్ ఉంది. మొత్తంగా అతనికి ఇది ఎనిమిదో టోర్నమెంట్. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021 సీజన్లల్లో ప్లేయర్‌గా ఆడాడు. తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తోన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలను అందుకున్నాడు రోహిత్ శర్మ. మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్నాడు. ఆసియా కప్ 2022 ఓటమి..అతనికి చేదు జ్ఞాపకం.