T20 World Cup 2026: కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా గర్వంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. అయితే దాయాదుల మధ్య పోరు ఎప్పుడూ అభిమానులకు కన్నులపండుగే. అందుకే ఈ ప్రపంచ కప్‌లో భారత్, పాక్ జట్లు మళ్లీ ఎప్పుడు తలపడతాయి? అసలు ఆ అవకాశం ఉందా? అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐసీసీ నిబంధనలు, ప్రస్తుత పాయింట్ల పట్టికను బట్టి చూస్తే ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని సంక్లిష్టమైన సమీకరణాలు ఉన్నాయి.
సూపర్-8లో మ్యాచ్ ఎందుకు ఉండదు?
మొదటిగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సూపర్-8 దశలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశం లేదు. ఐసీసీ ప్రవేశపెట్టిన 'ప్రీ-సీడింగ్' విధానం ప్రకారం ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. భారత్(X1) గ్రూప్-1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో కలిసి ఉండగా.. పాకిస్థాన్(Y3) గ్రూప్-2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలతో పోటీ పడుతోంది. సూపర్-8లో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని జట్లతోనే ఆడుతుంది కాబట్టి ఇక్కడ భారత్-పాక్ మ్యాచ్ జరిగే ఛాన్సే లేదు.

నాకౌట్ దశలోనే అమీతుమీ
భారత్-పాక్ జట్లు ఈ టోర్నీలో మళ్లీ తలపడాలంటే అది కేవలం సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలోనే సాధ్యమవుతుంది. సూపర్-8లోని రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఒకవేళ భారత్ గ్రూప్-1లో టాపర్‌గా నిలిచి.. పాకిస్థాన్ తన గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిస్తే.. అలా కాకుండా భారత్ గ్రూప-1లో రెండో స్థానంలో నిలిచి.. పాకిస్థాన్ గ్రూప్-2లో మొదటి స్థాననంలో నిలిస్తే.. మార్చి 4 లేదా 5న జరిగే సెమీఫైనల్‌లో ఈ దాయాది జట్లు ఢీకొనే అవకాశం ఉంది. ఇది జరగాలంటే పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
2007 ఫైనల్ రిపీట్ అవుతుందా?
అభిమానుల అసలు కోరిక ఏమిటంటే.. 2007 టీ20 ప్రపంచ కప్ లాగా భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడాలి. ఇది జరగాలంటే రెండు జట్లు సెమీఫైనల్స్ దాటి తుది పోరుకు అర్హత సాధించాలి. ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్ చూస్తుంటే సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ పాకిస్థాన్ పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా ఉంది. వారు ముందుగా సూపర్-8కు క్వాలిఫై అవ్వాలి, ఆపై అక్కడ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లను దాటుకుని సెమీస్ చేరాలి. ఒకవేళ అంతా కలిసొస్తే, దశాబ్దన్నర కాలం తర్వాత మళ్లీ మనం వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-పాక్ యుద్ధాన్ని చూడవచ్చు.
భారత్ ముందస్తు షెడ్యూల్ సిద్ధం
ఇప్పటికే సూపర్-8లో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న చెన్నైలో ఆస్ట్రేలియాతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటే సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. మరోవైపు పాకిస్థాన్ గనుక ఫిబ్రవరి 18న నమీబియాపై గెలిస్తేనే వారి ఆశలు సజీవంగా ఉంటాయి. మొత్తానికి అభిమానులు మాత్రం 'మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్' అని నినదిస్తున్నారు.