IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దూసుకెళ్తోంది. తొలుత బంగ్లాదేశ్ ను ఓడించిన భారత్.. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి సెమీస్ వైపు దూసుకెళ్లింది. 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. ఈ క్రమంలో పాక్ ఛాంఫియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. మరోసారి పాకిస్థాన్ భారత్ ముందు లొంగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఓ వైపు గెలిచిన టీమిండియాను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతూ సంబరాలు చేసుకుంటుండగా.. పాక్ అభిమానులు సొంత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
పాక్ అభిమానులు ఆ దేశ ఆటగాళ్ల ఆటతీరుతో చాలా నిరాశ చెందారు. పాకిస్థాన్ జట్టు ఇంత చెత్తగా ఆడుతుందని ఊహించుకోలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోలో పాక్ కు చెందిన అమ్మాయి సొంత జట్టుపై మండిపడింది. ఆ అమ్మాయి కెమెరా ముందు ఏడుస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె పాకిస్థాన్ జట్టుపై చాలా కోపంగా కనిపించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ పిచ్ పై భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక పాక్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ తరఫున సౌద్ షకీల్ అత్యధికంగా 66 పరుగులు చేశాడు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో ఇంకా 45 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఇది కోహ్లీకి తన అంతర్జాతీయ కెరీర్ లో 82వ సెంచరీ.