
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు అభిమానులను కనువిందు చేయబోతున్నాయి. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాలనుకుంటున్నాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచును కొందరు ఓ యుద్ధంలా చూస్తున్నారు. మైదానంలో కూడా ఢీ అంటే ఢీ అనేలా ఫాన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ ఈ మెగా మ్యాచ్‌పై స్పందించాడు. ఈ మ్యాచ్‌ను కేవలం ఓ గేమ్‌లాగే చూడాలని, యుద్ధంగా చూడొద్దని అభిమానులను కోరాడు. రాజకీయాలు, ద్వేషానికి, అహంకారానికి దూరంగా క్రికెట్‌ను చూడటం ఎల్లప్పుడూ మంచిదని కైఫ్ పేర్కొన్నాడు. 'ఈ ఉద్రిక్త ఉదయాన ఒక చిన్న సలహా. రాజకీయాలు, ద్వేషం, అహంకారం నుంచి దూరంగా ఉండి క్రికెట్ చూడటం ఎల్లప్పుడూ గొప్ప ఆలోచన. ఈ రోజును ఆస్వాదించండి. మీ ప్రత్యర్థి ఓటమిని కాకుండా మీ గెలుపును సంబురంగా జరుపుకోండి. ఈ మ్యాచును యుద్ధంగా కాదు, గేమ్‌లాగే భావించండి' అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.
2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్‌లోనే కాదు.. వన్డే ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకూ భారత్‌ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్థాన్ ఓడించలేకపోయింది. మొత్తంగా ప్రపంచకప్‌లో పాక్‌పై 12-0తో అజేయ రికార్డ్‌ని టీమిండియా కొనసాగిస్తోంది. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే పాక్ గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌ని ఓడించే భారత్ విజేతగా అవతరించింది. భారత్‌తో ఈరోజు తలపడే జట్టుని పాకిస్థాన్ శనివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మందితో కూడిన పాక్ జట్టులో ఒక్కరు మాత్రమే రిజర్వ్ బెంచ్‌పైకి వెళ్లనున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది టాస్ సమయంలో తేలనుంది. మరోవైపు భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి/శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్/భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రౌప్/హైదర్ అలీ.