
దుబాయ్: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అదో థ్రిల్. దాయాదుల సమరం ఓ సూపర్ ఎన్‌కౌంటర్‌లా ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. ఇక మైదానంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు అయిదు సార్లు తలపడ్డాయి. ఆ ఐదు మ్యాచుల్లో టీమిండియాదే పైచేయి. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఇండియా ఇప్పటి వరకు ఓడిపోలేదు. పవర్‌ఫుల్ షాట్లతో ప్రేక్షకుల్ని అలరించే ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే తన ఆధిపత్యాన్ని చాటింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయంగా నిలిచిన భారత్.. మరోసారి ఆ రికార్డును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం విజయం సాధించేందుకు తహతహలాడుతోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం పోటీ పడనున్నాయి.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గతకొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టులో ఆశలు రేపుతోంది. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ రెండు జట్ల బలాబలాలను విశ్లేషించాడు. యూఏఈ పరిస్థితుల విషయంలో పాకిస్తాన్ కన్నా.. భారత జట్టుకే ఎక్కువ సానుకూలత ఉందని ఆమిర్ అన్నాడు. ఎందుకంటే భారత క్రీడాకారులు కొన్నిరోజుల క్రితం వరకూ యూఏఈలోనే ఐపీఎల్ ఆడారని, అందుకే ఇక్కడి పరిస్థితులకు వారు బాగా అలవాటు పడ్డారని ఆమిర్ పేర్కొన్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ విభాగంలో పాక్ జట్టు కొంత బలంగా ఉందని ఆయన చెప్పాడు.
భారత జట్టులో మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్ 2021లో కొంత ఇబ్బంది పడటం చూశామని మహమ్మద్ ఆమిర్ గుర్తుచేశాడు. టీ20 క్రికెట్‌లో దేన్నీ అంచనా వేయలేమని చెప్పాడు. అయితే పరిస్థితులకు అలవాటు పడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కొంత ఎక్కువ ఉన్నాయని అమిర్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం భారత్‌కు 60 శాతం ఉంటే.. పాకిస్థాన్‌కు 40 శాతం ఉందని పాక్ మాజీ పేసర్ పేర్కొన్నాడు. అయితే పాకిస్తాన్ అన్ని విభాగాల్లో రాణిస్తే విజయం సాధించడం సులువే అని ఆయన పేర్కొన్నాడు.
2021 టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా గ్రూప్-2లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. మరికొద్ది గంటల్లో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. ఇక 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్, టీమిండియా జట్ల తరపున ఆడిన ఆటగాళ్లలో ప్రస్తుత మ్యాచ్‌ను ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఆడనున్నారు. వారిలో టీమిండియా నుంచి రోహిత్ శర్మ అయితే.. పాకిస్తాన్ నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఈముగ్గురిపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. మార్ వీరు ఎలా రాణిస్తారో చూడాలి. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. దుబాయ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది.