IND vs PAK: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోమని తేల్చి చెప్పింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించింది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. అప్పుడు పాకిస్థాన్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ కు వచ్చింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్ లో పర్యటించింది.అప్పుడు టీమిండియా ఆసియా కప్‌లో పాల్గొంది. అయితే 2005-06 తర్వాత భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్ ను సందర్శించలేదు.
కాశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగించడంతో పాటు స్థానికులు, పర్యాటకులలో భయాన్ని సృష్టించిన ఉగ్రవాద దాడులపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "మేము పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడము. బాధితులకు మద్దతుగా నిలుస్తాము. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం ఏం చెప్పినా అలాగే చేస్తాం." అని పేర్కొన్నారు. స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ, 'ప్రభుత్వ సూచనల కారణంగా మేము పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడము' అని అన్నారు. ఐసీసీ ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రం ఆడతామని చెప్పారు. ఏం జరిగినా అది వారే చేశారని ఐసీసీసీకి కూడా తెలుసన్నారు.

విచారం వ్యక్తం చేసిన బీసీసీఐ కార్యదర్శి
అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మరణించడం పట్ల క్రికెట్ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు లోనైంది. ఈ దారుణమైన, పిరికి చర్యను బీసీసీఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలు శాంతించాలని ప్రార్థిస్తున్నాను. వారి బాధను, దుఃఖాన్ని పంచుకుంటూ ఈ విషాద సమయంలో వారితో నిలబడతాం" అని అన్నారు.