
బ్రిస్బేన్: గాయం వల్ల టీమిండియా ఏస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా- ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌కు దూరం అయ్యాడు. టీ20.. ప్రత్యేకించి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన బుమ్రా అందుబాటులో లేకపోవడం జట్టు గెలుపోటములను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బుమ్రా స్థానంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీపక్ చాహర్ కూడా గాయపడటంతో అతనికి బదులుగా శార్దుల్ ఠాకూర్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా చోటు కల్పించింది.
బుమ్రా అందుబాటులో లేకపోవడంపై కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అతని స్థానంలోమహ్మద్ షమీ జట్టులోకి రాబోతోన్నాడని పేర్కొన్నాడు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడం శుభపరిణామమని వ్యాఖ్యానించాడు. బ్రిస్బేన్‌లో జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో అతను పాల్గొంటాడని వివరించాడు. అలాగే ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉందని, దీనికి అనుగుణంగా బౌలింగ్ చేస్తాడని ఆశిస్తోన్నట్లు చెప్పాడు రోహిత్ శర్మ.
బుమ్రాకు విశ్రాంతి కల్పించడాన్ని సమర్థించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కంటే అతని కేరీర్‌కే తాను అధిక ప్రాధాన్యత ఇస్తోన్నానని స్పష్టం చేశాడు. గాయపడటం అనేది ఎవరూ ఊహించబోరని, అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకున్న దశలో బుమ్రా దూరం అయ్యాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం అతణ్ని సన్నద్ధుడిని చేయడానికి టీమ్ మేనేజ్‌మెంట్ తన శాయశక్తులా కృషి చేసిందని గుర్తు చేశాడు.

నిపుణులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వచ్చామని, నేషనల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో రిహాబిలిటేషన్‌కూ బుమ్రాను పంపించామని రోహిత్ శర్మ చెప్పాడు. సకాలంలో గాయం తగ్గలేదని, ఆశించిన స్థాయిలో ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయాడని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ చాలా ముఖ్యమే అయినప్పటికీ- దానికంటే కేరీర్ ముఖ్యమని పేర్కొన్నాడు. ఓ క్రీడాకారుడికి గాయాలు ఆటలో భాగమేనని, ఏ ప్లేయర్‌కయినా తప్పదని అన్నాడు.
గాయపడినందుకు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై దృష్టి సారించాల్సి ఉంటుందని రోహిత్ శర్మ అన్నాడు. బుమ్రా వయస్సు 28 సంవత్సరాలే కావడం వల్ల సుదీర్ఘకాలం క్రికెట్ ఆడగలిగే శక్తిసామర్థ్యాలు అతనిలో ఉన్నాయని చెప్పాడు. బుమ్రా కేరీర్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని తాము నిర్ణయించుకున్నామని, దానికి అనుగుణంగానే తాము ప్రణాళికలను రూపొందించుకున్నామనీ అన్నాడు.