
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఆదివారం ఉదయం 9:30 గంటలకు తొలి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక - నమీబియా తలపడనున్నాయి. విక్టోరియాలోని కర్డీనియా పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్‌కు వేదిక. అదే స్డేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-నెదర్లాండ్స్ ఢీ కొట్టనున్నాయి.
మొత్తం 16 జట్లు పాల్గొంటోన్న ఈ ఈవెంట్‌లో నాలుగు టీమ్స్ వెనుదిరగాల్సి ఉంటుంది. గ్రూప్ దశలో క్వాలిఫై అయిన జట్లే సూపర్ -12కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి సూపర్ -12 రౌండ్ కొనసాగుతుంది. ఈ దశలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య షెడ్యూల్ అయింది. ఆ మరుసటి రోజే భారత్-పాకిస్తాన్ తలపడతాయి. ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎవరు ముద్దాడతారనే విషయం మీద ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తాజాగా- టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశారు. ఏ జట్టును కూడా తేలిగ్గా తీసుకోవద్దని, అన్నీ ప్రమాదకరంగా కనిపిస్తోన్నాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి- శ్రీలంక జట్టు విధ్వంసకారిగా మారే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. శ్రీలంకను తేలిగ్గా తీసుకుంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చని అంచనా వేశాడు గంభీర్. ఆసియా కప్‌లో తనకంటే ఎంతో బలమైన భారత్‌ను కూడా ఓడించిన సత్తా లంకేయులకు ఉందని గుర్తుచేశారాయన.
ఆసియా కప్‌లో శ్రీలంక సాధించిన విజయాన్ని బట్టి చూస్తే- ఆ జట్టు అలాంటి అద్భుతాన్ని సృష్టించక మానదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు గౌతమ్ గంభీర్. లంక ప్లేయర్లు ఆడుతున్న విధానం, సరిగ్గా టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం, జట్టు ఆటగాళ్లందరూ ఆత్మవిశ్వాసం కనిపిస్తోండటం వంటి అంశాలన్నింటినీ తాను పరిగణనలోకి తీసుకున్నానని చెప్పారు. లంక ఆటతీరు ప్రస్తుతం అత్యున్నతంగా ఉందని వ్యాఖ్యానించారు.
దుష్మంత చమీర, లహిరు కుమార జట్టులో పునాగమనం చేయడంతో మరింత బలపడిందని చెప్పుకొచ్చారు గౌతమ్ గంభీర్. ఫలితంగా ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌లో శ్రీలంక సమతుల్యంగా కనిపిస్తోందని అన్నారు. ఖచ్చితంగా శ్రీలంక జట్టు ప్రత్యర్థులకు పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. టీ20 ప్రపంచ కప్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు ప్లేయర్లు ఉన్నారని స్పష్టం చేశారు. పొట్టి ఫార్మాట్‌లో ఏ జట్టును కూడా తేలికగా తీసుకోకూడదని అన్నారు.