పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ తడబడుతోంది. తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం లంచ్ విరామానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. కివీస్ కంటే 152 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో జడేజా (11), సుందర్ (2) ఉన్నారు.
రెండో రోజు ఆట మొదటి సెషన్‌లో భారత్ 91 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఇవాళ విరాట్ కోహ్లి ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక్క పరుగు చేసి మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. శాంట్నర్ వేసిన ఫుల్‌టాస్‌ను మిడ్ వికెట్ మీదుగా ఆడాలని క్రాస్ బ్యాటెడ్ షాట్ ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. కోహ్లి కెరీర్‌లోనే ఇది చెత్త షాట్ అని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

అయితే 2021 నుంచి ఆసియాలో కోహ్లి ఔటైన తీరు టీమిండియా మేనేజ్మెంట్‌ను, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసియాలో గత మూడేళ్లలో కోహ్లి 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు స్పిన్‌లోనే ఔటయ్యాడు. స్పిన్‌లో 28 సగటుతో 606 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేటు 49.67 మాత్రమే. ఇక ఇందులో పదిసార్లు లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
ఎడమచేతి వాటం స్పిన్నర్లపై కోహ్లి సగటు 27.10 మాత్రమే. స్పిన్ క్రమంగా విరాట్ కోహ్లికి బలహీనతగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లి వికెట్‌ను స్పిన్నర్లకు సమర్పించుకుంటున్నాడని పేర్కొంటున్నారు. అయితే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. ఇవాళ ఆటలో కోహ్లి షాట్ ఎంపికను సమర్థించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్లకు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం మంచి వ్యూహమని కుంబ్లే అన్నాడు. ఎదురుదాడికి ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడని అన్నాడు.