టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అధిగమించి ఈ రికార్డు సాధించాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.
ఈ జాబితాలో అగ్రస్థానంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 1989 నుంచి 2013 వరకు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సచిన్ 664 మ్యాచ్‌లు ఆడాడు. రెండో స్థానంలో ఉన్న కోహ్లి 536 మ్యాచ్‌లు ఆడాడు. 2004 నుంచి 2019 వరకు టీమిండియాకు ఆడిన ధోనీ 535 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. ధోనీ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఉన్నారు. హిట్‌మ్యాన్ 486, జడ్డూ 346 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.

విరాట్ కోహ్లి తన కెరీర్‌లో 27041 పరుగులు చేశాడు. 80 సెంచరీలు సాధించాడు. 116 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. టీ20 వరల్డ్ కప్ విజయానంతం కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఈ స్పెషల్ మ్యాచ్‌లో కోహ్లి డకౌటయ్యాడు. ఒరుర్కె వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లి గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాస్త ఎక్స్‌ట్రా బౌన్స్ అయిన బంతిని డిఫెండ్‌కు ప్రయత్నించి లెగ్ గల్లీలో ఉన్న ఫిలిప్స్‌కు దొరికిపోయాడు.
విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మ (2), సర్ఫరాజ్ (డకౌట్) కూడా విఫలమవ్వడంతో భారత్ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి, ఒరుర్కె, మ్యాట్ హెన్రీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మెడనొప్పి కారణంగా శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌కు దూరమవ్వడంతో విరాట్ వన్‌డౌన్‌లో వచ్చాడు. సాధారణంగా కోహ్లి టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.