బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు.
మరో 53 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 9వేల పరుగులు అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి రికార్డులకెక్కుతాడు. భారత క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే 9000 పరుగుల మార్క్‌ను అందుకున్నారు. సచిన్ టెండూల్కర్ (15921 రన్స్), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122) ఈ ఘనత సాధించారు. కాగా, కోహ్లి ప్రస్తుతం 8947 పరుగలు సాధించాడు. 115 టెస్టుల్లో 48.89 సగటుతో పరుగులు చేశాడు.

కాగా, న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మరో 18 పరుగులు సాధిస్తే వీరేంద్ర సెహ్వాగ్, చెతేశ్వర్ పుజారాను అధిగమించి మూడో స్థానానికి చేరుతాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (1659), సచిన్ టెండూల్కర్ (1595), వీరేంద్ర సెహ్వాగ్ (883), పుజారా (867), విరాట్ కోహ్లి (866) వరుసగా ఉన్నారు.
అయితే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. పూర్తిగా తెరపించిన తర్వాత మైదాన సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో మొదటి సెషన్ రద్దయ్యేలా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది.
కాగా, తొలి టెస్టు సజావుగా సాగడం అనుమానమే అనిపిస్తోంది. వారం రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.