బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడనుంది. బుధవారమే ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దయింది. అయితే రెండో రోజు వరుణుడు కాస్త కరుణించడంతో టాస్ పడింది.
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకంది. వర్షం కారణంగా పిచ్ కవర్ల కింద ఉన్నప్పటికీ తొలుత సాహసోపేతంగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించాడు. ''తొలుత ఇబ్బంది ఎదురవుతుందని తెలుసు. కానీ పిచ్ స్వభావాన్ని బట్టి, మొదట ఎక్కువగా పరుగులు చేయాలని భావించాం. మ్యాచ్ ఫలితం రావాలని ఆశిస్తున్నాం'' అని రోహిత్ అన్నాడు.

జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని రోహిత్ తెలిపాడు. మెడనొప్పితో ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్, యువ పేసర్ ఆకాశ్ దీప్ తుదిజట్టులో చోటు కోల్పోయారు. వారి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది.
భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీమిండియా 12 టెస్టు సిరీస్ ఆడింది. 10 సిరీస్‌లు గెలవగా, రెండు డ్రా అయ్యాయి.
జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథి, అజాజ్ పటేల్, విలియమ్ ఒరుర్కే.