బంగ్లాదేశ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది బౌలర్ల యుగమని అన్నాడు.
''ఇది బౌలర్ల యుగం. బ్యాటర్లు 1000 పరుగులు చేసినా టెస్టు మ్యాచ్ గెలుస్తామని గ్యారెంటీగా చెప్పలేం. కానీ బౌలర్లు 20 వికెట్లు పడగొడితే 99% గెలుస్తామని ధీమాగా చెప్పగలం. టెస్టులే కాదు, ఏ ఫార్మాట్ అయినా, టోర్నమెంట్స్ అయినా గెలవాలంటే బౌలర్ల చేతుల్లోనే ఉంటుంది. రాబోయే కాలంలో బ్యాటర్ల కంటే బౌలర్ల గురించే ఎక్కువగా మనం మాట్లాడతామని ఆశిస్తున్నా. కాలక్రమేణా మనస్తత్వం మారుతుందని ఆశిస్తున్నా'' అని గంభీర్ అన్నాడు.

ఒకప్పుడు దేశంలో క్రికెట్ అంటే బ్యాటర్లను మాత్రమే పొగిడే వాళ్లని, దాన్ని బౌలర్ల ఆటగానూ జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మార్చారని గంభీర్ అన్నాడు. స్టార్ బ్యాటర్ల కంటే టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రా అని కొనియాడాడు. ''బ్యాటింగ్‌ను ఆరాధించేలా భారత్ ఒకప్పుడు ఉండేది. కానీ బుమ్రా, అశ్విన్, జడేజా దాన్ని మార్చారు. టెస్టు క్రికెట్‌లో బుమ్రా ఎంతో తెలివైనవాడు. వీళ్లు ట్రెండ్‌ను మార్చడం ఎంతో బాగుంది. ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ బుమ్రా. ఏ సమయంలోనైనా ఆటను మార్చగలడు'' అని గంభీర్ అన్నాడు.
బెంగళూరు వేదికగా అక్టోబర్ 16 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. పుణె వేదికగా అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు జరగనుంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్ విజయం సాధించడం భారత్‌కు ఎంతో కీలకం.