
ముంబై: భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ వారసునిగా వరంగల్‌కు చెందిన టీ దిలీప్.. టీమిండియాకు సేవలందించబోతున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ ఎంపికైనట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో శ్రీధర్ స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ పేర్లను ఖరారు చేసినట్లు కూడా సమాచారం తెలుస్తోంది.
అభయ్ శర్మతో కలిసి ఫీల్డింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న టీ దిలీప్ వైపు క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గత జూలైలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి భారత ద్వితీయ శ్రేణి జట్టుకు దిలీప్ ఫీల్డింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అంతేకాకుండా భారత్ 'ఎ' జట్టుతో కలిసి న్యూజిలాండ్ పర్యటనలో పాలుపంచుకున్నాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీఏసీ.. అభయ్‌కు బదులు దిలీప్ అనుభవానికి పెద్దపీట వేసినట్లు సమాచారం. అయితే కొత్త కోచ్ ద్రవిడ్ మాత్రం అభయ్ కావాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దిగ్గజం ద్రవిడ్ మాటకు బీసీసీఐ కట్టుబడి ఉంటుందో లేదో చూడాలి.
హెచ్‌సీఏ ఎ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ సీసీ తరఫున టీ దిలీప్ బరిలో దిగాడు. బీసీసీఐ లెవెల్-3 కోర్సు పూర్తి చేసిన దిలీప్.. 14 ఏళ్ల కోచింగ్ కెరీర్‌లో టీమిండియా, ఇండియా అండర్-19, ఫస్ట్‌క్లాస్ జట్లకు ఫీల్డింగ్ శిక్షకుడిగా పనిచేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ పర్యటనలో తన పనితీరు పట్ల టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు దిలీప్ పేర్కొన్నాడు. యుక్త వయసు నుంచే కోచింగ్ పట్ల ఇష్టాన్ని పెంచుకున్న 38 ఏళ్ల దిలీప్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దక్కన్ చార్జర్స్ (డీసీ) జట్టుకు ట్రెవర్ పెన్నీతో కలిసి పనిచేయడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సహాయక బృందంలో చేరేవరకు హైదరాబాద్ జట్టుకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
ఎన్‌సీఏలో అభయ్ శర్మ సేవలు అవసరమని భావించిన క్రికెట్ సలహా కమిటీ.. టీ దిలీప్‌కు ఓటు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్న విక్రమ్ రాథోర్‌కు మరోసారి ఆ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబర్ 17న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనతో వీరు బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.