IND vs NZ: చేతులెత్తేసిన రోహిత్.. నిస్సహాయంగా గంభీర్ (Video)
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. రెండో రోజు ఆటలో బ్యాటర్లు నిరాశపరచగా, మూడో రోజు తొలి సెషన్‌లో బౌలర్లు ఉసూరుమనిపించారు. కివీస్ బ్యాటర్ల విధ్వంసంతో మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. అనవసర తప్పిదాలు చేస్తున్నాడు. మరోవైపు టీమిండియా ప్రదర్శన చూస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ నిస్సహాయంగా కనిపిస్తున్నాడు.
శుక్రవారం ఆటలో లంచ్ విరామానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 345 పరుగులు చేసింది. 299 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర (104; 125 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అర్ధశతకానికి చేరువలో ఉన్న టిమ్ సౌథి (49; 50 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. అయితే ఇవాళ ఆటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఆదిలోనే వికెట్ల వేట మొదలుపెట్టింది.

ఆట ఆరంభమైన కాసేపటికే డారిల్ మిచెల్ (18)ను సిరాజ్, టామ్ బ్లండెన్ (5)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం బంతిని అందుకున్న రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిఫ్స్ (14), మ్యాట్ హెన్రీ (8)ని జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 233 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అసలు విధ్వంసం మొదలైంది. క్రీజులోకి వచ్చిన టిమ్ సౌథితో రచిన్ రవీంద్ర ఎనిమిదో వికెట్‌కు 97 బంతుల్లోనే అభేద్యమైన 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్‌దీప్ బౌలింగ్‌లో రచిన్, సౌథి బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తిస్తున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ లంచ్ విరామానికి ముందు ఆఖరి ఓవర్ వరకు పేసర్లకు బంతిని అందివ్వకపోవడం గమనార్హం. బౌండరీలను కట్టడి చేయడానికి ఫీల్డర్లను మోహరించడంలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. అంతేగాక ఒత్తిడిలో సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్‌లో రోహిత్ అనవసరపు ఓవర్‌త్రోతో 4 పరుగులు అదనంగా సమర్పించాడు.
టీ20 తరహాలో న్యూజిలాండ్ చెలరేగిపోతున్నా బుమ్రాకు రోహిత్ బంతి అందివ్వలేదు. లంచ్ విరామానికి ముందు చివరి నాలుగు ఓవర్లలో కివీస్ ఏకంగా 58 పరుగులు రాబట్టుకుంది. అశ్విన్ వేసిన ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. మైదానంలో టీమిండియా ప్రదర్శనను డ్రెస్సింగ్ రూమ్ నుంచి గంభీర్ నిస్సహాయంగా గమనిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications