సొంతగడ్డపై భారత్‌కు ఊహించని పరాభవం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది.
అయితే 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ ఓటమికి ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కారణంగా భావించలేమని పేర్కొన్నాడు. వాళ్లపై నెలకొన్న భారీ అంచనాలతో ప్రతిసారి టెస్టు మ్యాచ్ గెలిపిస్తారని ఆశిస్తామని, కానీ ఓటమికి బాధ్యత వారిద్దరిదే కాదని తెలిపాడు.

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 16 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చాడు. కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన టెస్టు ఇన్నింగ్స్‌లో ఎకానమీ రేటు పరంగా అశ్విన్‌కు ఇదే అత్యంత పేలవమైన రికార్డు. పుణె టెస్టులోనూ కివీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దాదాపు నాలుగు ఎకానమీతో బౌలింగ్ చేశాడు. రెండో టెస్టులో తన అయిదో బంతికే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత అదే జోరును ప్రదర్శించలేకపోయాడు.
మరోవైపు న్యూజిలాండ్ బ్యాటర్ల ఎదురుదాడికి జడేజా వద్ద సమాధానం లేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు సాధించలేకపోయాడు. మొత్తంగా 37.4 ఓవర్లు వేసి ప్రత్యర్థిపై పైచేయి సాధించలేకపోయాడు. మరోవైపు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మాత్రం 157 పరుగులిచ్చి 13 వికెట్లు పడగొట్టాడు.
''వారిద్దరిపై చాలా అంచనాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లో వాళ్లు వికెట్లు, పరుగులు సాధిస్తారని ఆశిస్తాం. టెస్టులు గెలిపిస్తారని భావిస్తాం. అయితే ఇది సరైంది కాదు. టెస్టుల్లో విజయాలు సాధించడంలో అందరిపై బాధ్యత ఉంది. కేవలం వారిద్దరిపైనే కాదు. వాళ్లు నెలకొల్పిన ప్రమాణాల పరంగా వారిద్దరు సత్తాచాటలేకపోయారు. సొంతగడ్డపై 18 టెస్టు సిరీస్ వరుస విజయాల్లో వారిద్దరిది ప్రధాన పాత్ర. అయితే కొన్నిసార్లు బ్యాడ్ గేమ్స్ కూడా ఎదురవుతాయి. ప్రతీసారి వికెట్లు, పరుగులు సాధించలేరు''
''బ్యాటింగ్‌లో సమష్టిగా సత్తాచాటడం ఎంత ముఖ్యమో, బౌలింగ్ యూనిట్‌లోనూ అంతే. అశ్విన్ రాణించలేకపోతే జడేజా సత్తాచాటాలి. లేదా సుందర్, కుల్‌దీప్, అక్షర్.. ఇలా ఎవరో ఒకరు సత్తాచాటాలి. ఇక వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన పట్ట ఎంతో గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. అతను బాగా బౌలింగ్ చేశాడు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన సుందర్, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.