పుణె వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెజు ఆట ముగిసేసరికి టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్‌ను కోల్పోయి 16 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది.
డెవాన్ కాన్వే (76; 141 బంతుల్లో, 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే గురువారం ఆటలో సరదా సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ప్లేయర్ అజాజ్ పటేల్‌కు హిందీ రాదని సుందర్‌కు రిషభ్ పంత్ హిందీలో సూచనలు ఇవ్వగా అవి బెడిసి కొట్టాయి.

అసలేం జరిగిందంటే.. 78వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్‌కు పంత్ హిందీలో సూచనలు ఇచ్చాడు. క్రీజులో ఉన్న అజాజ్ పటేల్‌కు లిటిల్ ఫుల్లర్‌గా బౌలింగ్ చేయమని చెప్పాడు. అయితే ఆ బంతిని అజాజ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిడాన్ మీదుగా బౌండరీ సాధించాడు. పంత్ సూచనలు పనిచేయకపోవడమే కాకుండా బెడిసి కొట్టడంతో సుందర్ అసహనంగా చూశాడు. దానికి పంత్ 'అరె.. అతనికి హిందీ అర్థమవుతుందని నాకేం తెలుసు' అని బదులిచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వాషింగ్టన్ సుందర్‌కు పంత్ ఇచ్చిన సూచన మొత్తం హిందీలోనే ఉన్నప్పటికీ 'లిటిల్ ఫుల్లర్' అంటూ ఇంగ్లిష్‌లోనే చెప్పాడు. ఈ పదం అర్థం చేసుకుని అజాజ్ పటేల్ బౌండరీ బాది ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అదే ఓవర్ ఆఖరి బంతికి అజాజ్ పటేల్‌ను సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు.