వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి టెస్టులో థర్డ్ అంపైర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సమీక్షలో రిషభ్ పంత్ ఔట్ అంటూ తీసుకున్న థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనది కాదని వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ ప్యాడ్‌కు బ్యాటు తాకడంతో అల్ట్రాఎడ్జ్‌లో రీడింగ్ చూపించిందని నెట్టింట్లో ఫ్రూప్స్ వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఇదే విషయాన్ని మైదానంలోని అంపైర్లతో పంత్ వివరిస్తూ కన్నీటితో పెవిలియన్‌కు చేరాడు.
ఛేదనలో రిషభ్ పంత్ పోరాటం ముగిసింది. 29 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి ఓటమి దశగా సాగుతున్న భారత్‌ను తన వీరోచిత పోరాటంతో పంత్ గెలుపు ఆశలు రేకెత్తించాడు. 57 బంతుల్లో 64 పరుగులు చేశాడు. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అయితే పంత్ ఔట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజాజ్ పటేల్ వేసిన బంతిని ముందుకు వచ్చి పంత్ డిఫెన్స్ చేశాడు. బంతి ప్యాడ్‌కు తాకి గాల్లోకి లేచింది.

వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్‌ను అందుకుని ఔట్ అంటూ అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. అయితే న్యూజిలాండ్ రివ్యూకి కోరింది. ఒకే రివ్యూ ఉన్నప్పటికీ పంత్ కీలక వికెట్ కావడంతో కివీస్ రిస్క్ తీసుకుంది. సమీక్షలో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్‌ను ఆధారంగా చేసుకుని పంత్‌ను ఔట్‌గా నిర్ణయించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ రీడింగ్ చూపించే సమయంలో పంత్ తన బ్యాటును ప్యాడ్‌కు తాకించాడు. దాంతోనే అల్ట్రాఎడ్జ్ అలా చూపిస్తుందని పంత్ మైదానంలో అంపైర్లకు వివరించాడు. మరోవైపు థర్డ్ అంపైర్ బంతి గమనం కాస్త మారిందంటూ ఔట్ ఇచ్చాడు.
అయితే అల్ట్రాఎడ్జ్ రీడింగ్ చూపించిన సమయంలో బ్యాటుకు-బంతికి గ్యాప్ ఉందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. పంత్ నాటౌట్ అని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు జట్టును విజయతీరాలకు చేర్చకుండానే ఔటయ్యాననే బాధతో పంత్ అతికష్టంగా మైదానాన్ని వీడాడు. కాగా, భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
I think it was the bat hitting the pad that made the disturbance on ultra-edge.
— Johns (@JohnyBravo183) November 3, 2024
Rishabh Pant was also trying to explain the same thing to the umpires.
That's why we need HotSpot + UltraEdge in DRS. pic.twitter.com/77Tw7LcrAp