పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ 31 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (47 బ్యాటింగ్; 108 బంతుల్లో, 5 ఫోర్లు), రచిన్ రవీంద్ర (5 బ్యాటింగ్; 13 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ టామ్ లాథమ్ (15; 22 బంతుల్లో, 2 ఫోర్లు), విల్ యంగ్ (18; 45 బంతుల్లో, 2 ఫోర్లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.
అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వీరిద్దరు 11 ఇన్నింగ్స్‌ల్లో తలపడగా.. లాథమ్‌ను అశ్విన్ 9 సార్లు ఔట్ చేయడం విశేషం. విల్ యంగ్ వికెట్‌ను అశ్విన్ రివ్యూలో దక్కించుకున్నాడు. లెగ్ సైడ్ దిశగా వేసిన బంతిని యంగ్ షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. సమీక్ష కోరడంలో సర్ఫరాజ్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ 2019లో డబ్ల్యూటీసీ ప్రారంభించింది. అప్పటి నుంచి డబ్ల్యూటీసీ సైకిల్‌లో 39 టెస్టులు ఆడిన అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. 11 సార్లు అయిదు వికెట్లు సాధించాడు. కాగా, అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ పేరిట ఉండేది.
నాథన్ లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. లైయన్ కంటే తక్కువ టెస్టులే ఆడిన అశ్విన్ డబ్ల్యూటీసీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా చరిత్రకెక్కాడు. అశ్విన్, లైయన్ తర్వాతి స్థానాల్లో ప్యాట్ కమిన్స్ (175 వికెట్లు, 42 టెస్టులు), మిచెల్ స్టార్క్ (147 వికెట్లు, 38 టెస్టులు), స్టువర్ట్ బ్రాడ్ (134 వికెట్లు, 33 టెస్టులు), కగిసో రబాడ (28 టెస్టులు, 132 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా (124 వికెట్లు, 130 టెస్టులు) ఉన్నారు.
Khan heard it 😉
— JioCinema (@JioCinema) October 24, 2024
Sarfaraz Khan convinces his skipper to make the right call 👌
Watch the 2nd #INDvNZ Test LIVE on #JioCinema, #Sports18 and #ColorsCineplex 👈#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Ioag6jQF7B