అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని ఒడిసిపట్టింది. మెరుపు ఫీల్డింగ్‌తో పాటు బంతితోనూ రాధ ఆకట్టుకుంది. పది ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది.
ప్రియా మిశ్రా వేసిన బంతిని కివీస్ బ్యాటర్ హాలిడే ఎక్సట్రా కవర్ మీదుగా షాట్‌కు యత్నించింది. అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. హాలిడే షాట్ ఎంపిక సరైనదే. కానీ రాధ యాదవ్ నమ్మశక్యం కానీ క్యాచ్ అందుకుంది. సర్కిల్ నుంచి వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి సమాంతరంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టింది. ఈ క్రమంలో ప్రియా మిశ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ సాధించింది. ఈ వికెట్ క్రెడిట్ రాధ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కే దక్కాలి.

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 259 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (79; 86 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), ఓపెనర్ సుజీ బేట్స్ (58; 70 బంతుల్లో, 8 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. మ్యాడీ గ్రీన్ (42; 41 బంతుల్లో, 5 ఫోర్లు), జార్జియా ప్లిమ్మర్ (41; 50 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. భారత బౌలర్లలో రాధ నాలుగు, దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కింది. తొలుత నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఓపెనింగ్ జోడీ సుజీ-గ్రీన్ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. గ్రీన్‌ను దీప్తి శర్మ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించింది. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో 139 పరుగులకే కివీస్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ ఈ స్థితిలో మ్యాడీ గ్రీన్‌తో కలిసి సారథి డివైన్ ఇన్నింగ్స్ చక్కదిద్దింది. అయిదో వికెట్‌కు గ్రీన్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆఖర్లో కివీస్ దూకుడుకు ప్రయత్నించి వికెట్లను వరుసగా కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఆకట్టుకున్నారు.