బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. రచిన్ రవీంద్ర (134; 157 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో మెరిశాడు. డెవాన్ కాన్వే (91; 105 బంతుల్లో, 11 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ సౌథి (65; 73 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తాచాటారు. టీమిండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు సాధించారు. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఇవాళ ఆటలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. గత 39 ఏళ్లలో సొంతగడ్డపై టీమిండియాపై పర్యాటక జట్టు సాధించిన అత్యధిక ఆధిక్యం ఇదే. ఓవరాల్‌గా ఇది మూడో అత్యధిక ఆధిక్యం. 2008లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 418 పరుగులు, 1985లో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 380 పరుగులు ఆధిక్యాన్ని సాధించాయి.

అయితే ఇవాళ ఆటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఆదిలోనే వికెట్ల వేట మొదలుపెట్టింది. ఆట ఆరంభమైన కాసేపటికే డారిల్ మిచెల్ (18)ను సిరాజ్, టామ్ బ్లండెన్ (5)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం బంతిని అందుకున్న రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిఫ్స్ (14), మ్యాట్ హెన్రీ (8)ని జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 233 పరుగలకే ఏడు వికెట్లు కోల్పోయింది.
కానీ రచిన్, టిమ్ సౌథి వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఎనిమిదో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా ఇది మూడో అత్యల్ప స్కోరు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్క్ (4/22) ధాటికి రిషభ్ పంత్ (20), యశస్వీ జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.