IND vs NZ: న్యూజిలాండ్‌తో రేపు(జనవరి 11) వడోదరలో జరగనున్న తొలి వన్డే కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తూనే మరోవైపు సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో తనదైన శైలిలో అల్లరి చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.
అర్ష్‌దీప్‌ను కాపీ కొట్టి కోహ్లీ!
ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపించారు. సహచర ఆటగాళ్లతో జోకులు వేస్తూ హై-ఫైవ్స్ ఇస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ వేయడానికి పరిగెత్తుకు వచ్చే స్టైల్‌ను కోహ్లీ అచ్చుగుద్దినట్లు అనుకరించారు. కోహ్లీ చేసిన ఈ వెరైటీ నటనను చూసి మైదానంలోని ఆటగాళ్లందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

భీకర ఫామ్‌లో విరాట్
ప్రస్తుతం కోహ్లీ కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డే టోర్నీ(విజయ్ హజారే ట్రోఫీ)లో ఆడిన కోహ్లీ.. ఢిల్లీ తరఫున ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ బాదారు.
వడోదరలో చారిత్రాత్మక మ్యాచ్
వడోదరలోని ఈ కొత్త స్టేడియంలో జరుగుతున్న తొలి పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ ద్వారా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి వస్తున్నారు. గాయాల కారణంగా వీరు దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కూడా నెట్స్‌లో గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.