పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అదృష్టం వరించింది. ఔటైనప్పటికీ అతను నాటౌట్‌గా మిగిలాడు. అలా అని అది నోబాల్ కాదు. కివీస్ ప్లేయర్లు ఔట్ అంటూ అపీల్ కూడా చేశారు. అయితే అవకాశాన్ని దక్కించుకున్న జడేజా అనంతరం చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విజృంభించాడు. కివీస్ ఆధిక్యాన్ని తన శక్తివంత మేరకు తగ్గించాడు.
అసలేం జరిగిందంటే.. 40 ఓవర్ మొదటి బంతిని మిచెల్ శాంట్నర్ కాస్త ఎక్సట్రా బౌన్స్‌గా సంధించాడు. దాన్ని జడ్డూ డిఫెండ్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటు-ప్యాడ్‌కు మిడిల్‌లో తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఉన్న విల్ యంగ్ డైవ్ చేస్తూ క్యాచ్‌ను గొప్పగా అందుకున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్లు ఔట్ అంటూ అపీల్ చేశారు. దానికి అంపైర్ నాటౌట్ అని బదులిచ్చాడు.

అయితే న్యూజిలాండ్ రివ్యూను కోరలేదు. అప్పటికే తమ వద్ద రెండు రివ్యూలు కూడా ఉన్నాయి. కానీ సమీక్ష కోరడానికి సంకోచించింది. రిప్లేలో జడేజా బ్యాటుకు బంతి తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దీని గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఔటా, నాటౌటా అని చెప్పడానికి విల్ యంగ్‌కు అందరి కంటే బెస్ట్ వ్యూ ఉందని, అతను రివ్యూ కోరమని ఒత్తిడి చేయాల్సిందని అన్నాడు.
రివ్యూ కోరకపోవడంతో 12 పరుగుల వద్ద బతికిపోయిన జడేజా అనంతరం చెలరేగాడు. తర్వాతి బంతి నుంచి బాదుడు మొదలుపెట్టాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అజాజ్ పటేల్ వేసిన తర్వాతి ఓవర్‌ల్లో రెండు సిక్సర్లు సాధించాడు. అయితే జోరు మీదున్న జడేజా మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 46 బంతులు ఎదుర్కొన్న జడేజా 38 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.
భారత్ ఇన్నింగ్స్‌లో జడేజానే టాప్ స్కోరర్. ఓవర్‌నైట్ స్కోరు 16/1తో శుక్రవారం ఆట ఆరంభించిన టీమిండియా 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో చెలరేగాడు. గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ 40 ఓవర్లకు 177/4 స్కోరు చేసింది. ఓవరాల్‌గా భారత్‌పై 277 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.