
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఈరోజు టీమిండియా రెండో మ్యాచ్ ఆడబోతోంది. న్యూజిలాండ్ జట్టుతో కోహ్లీసేన డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ విజమే ఇరు జట్ల సెమీఫైనల్‌కు వెళ్లే మార్గాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. దీంతో కోహ్లీసేన కివీస్‌పై గెలవాలని చూస్తోంది. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు సరదాగా గడిపింది. ఇన్నిరోజులు సాధనలో మునిగితేలిన భారత ఆటగాళ్లు శనివారం మాత్రం సందడి చేశారు. సోషల్ మీడియాలో కోహ్లీసేన సరదాగా గడుపుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శనివారం ప్రాక్టీస్ అనంతరం భారత ఆటగాళ్లు హాలోవీన్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో హిట్టర్ కిషన్ కిషన్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ డ్యాన్స్ చేశారు. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని జంటగా డ్యాన్స్ చేశారు. మిగతా ఆటగాళ్లు వీరిద్దరి డ్యాన్స్‌ను ఆస్వాదించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పిల్లలకు బహుమతులు పంపిణీ చేశాడు. పంత్ ఒక బ్యాగ్ నిండా చాక్లెట్లు, టోఫీలు తెచ్చి జట్టు సభ్యుల పిల్లలకు పంచాడు. రవిచంద్రన్ అశ్విన్ కుమార్తెలు, రోహిత్ శర్మ కుమార్తె పంత్ నుంచి చాక్లెట్లు, టోఫీలు అందుకున్నారు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల కూతురు వామిక కూడా ఈ పార్టీలో తళుక్కుమంది. వామిక దేవకన్యలా ముస్తాబయింది. సీతకోకచిలుక ఫ్రిల్లీ ఫ్రాక్ ధరించి ఓ ఎంజిల్లా నేలపై కూర్చుని సందడి చేసింది. విరాట్ కోహ్లీ తన చేతుల్లో వామికతో క్యాండీలను తీసుకున్నాడు. ఆపై ఇతర క్రికెటర్ల పిల్లలతో కలిసి వామిక ఆడుకుంది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎప్పటిలానే వామిక పూర్తి మొహం మాత్రం కనిపించలేదు. దాంతో ఫాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు. అనుష్క, విరాట్ డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. వారికి జనవరి 2021లో వామిక జన్మించింది. విరుష్క జంట ఇటీవలే వామిక ఆరు నెలల పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటాకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి. 18 ఏళ్లుగా ఐసీసీ ప్రపంచకప్‌లలో కివీస్‌కు ఎదురులేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021లలో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇదే ఇప్పుడు కోహ్లీసేనను ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్తాన్‌కు కూడా టీ20, వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియాపై పూర్ రికార్డు ఉన్నా.. తాజాగా భారత్‌ను పాక్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. భారత్ కూడా తమ చెత్త రికార్డును చేరిపోసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.